హైదరాబాద్: తెలంగాణలో లాక్‌డౌన్, కర్ఫ్యూ ప్రపోజల్ లేదని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ  డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. 

 సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యా సంస్థల్లో కరోనా కేసులు ఎక్కువ నమోదౌతున్నాయని ఆయన చెప్పారు. విద్యార్ధుల ద్వారా ఇంట్లోని వారికి కరోనా సోకే అవకాశం ఉందన్నారు. కేసుల పెరుగుదల చూస్తే సెకండ్ వేవ్ అనే చెప్పాలన్నారు.

వ్యాక్సినేషన్ పెరిగితే కరోనా నియంత్రణలోకి వస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. గత ఏడాది ఏ చర్యలు చేపట్టామో అవే మళ్లీ మొదలయ్యాయని ఆయన తెలిపారు. 
కరోనాపై పోరుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. అంతేకాదు ప్రజలంతా కోవిడ్ నిబంధనలను పాటించాలని కోరారు. 

అర్హులైనవారు తప్పకుండా టీకా వేయించుకోవాలని ఆయన సూచించారు.రాష్ట్రంలో ఇటీవల కాలంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా  విద్యాసంస్థల్లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో 8వ తరగతి వరకు విద్యార్ధులకు పై తరగతులకు ప్రమోట్ చేయాలనే యోచనలో తెలంగాణ సర్కార్ ఉంది. ఈ విషయమై త్వరలోనే  ప్రభుత్వం నుండి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.