పార్టీలో కొత్తగా చేరినవారికే ప్రాధాన్యత ఇస్తున్నారని బీజేపీ అసమ్మతి నేతలు అభిప్రాయపడ్డారు. మంగళవారం నాడు  అసమ్మతి నేతలు హైద్రాబాద్ లో మరోసారి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకొంది.  

హైదరాబాద్: పార్టీలో పాతవారికే ప్రాధాన్యత ఇవ్వడం లేదని BJP అసమ్మతి నేతలు అభిప్రాయపడ్డారు. మంగళవారం నాడు తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్, హైద్రాబాద్ ప్రాంతాలకు చెందిన కొందరు నేతలు సమావేశమయ్యారు. గతంలో కూడా సమావేశమైన నేతలే మరోసారి Hyderabad లో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకొంది. ఈ సమావేశం తర్వాత అసమ్మతి నేతలు మాట్లాడారు. 

బీజేపీలో కొత్తగా చేరిన వారికే ప్రాధాన్యత ఇవ్వడంపై ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఇంతకాలం పార్టీ అభివృద్ది కోసం పనిచేయలేదా అని ప్రశ్నించారు. పార్టీ అభివృద్ది కోసం తాము కష్టపడిన విషయాన్ని వారు గుర్తు చేశారు. తమకు ఆత్మాభిమానం ఉంటుందన్నారు. ఇది కొందరి సమస్య కాదు... వందలాది మంది కార్యకర్తల సమస్యగా వారు చెప్పారు. పార్టీ కోసం త్యాగాలు చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని వారు కోరారు.

హైదరాబాద్, Karimnagar జిల్లాలకు చెందిన గుజ్జుల రామకృష్ణారెడ్డి, రాములు, సుగుణాకర్ రావు, వెంకటరమణి వంటి పలువురు నేతలు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఇవాళ సమావేశమయ్యారు. గతంలోనే ఈ రకమైన రహస్య సమావేశాలపై బీజేపీ నాయకత్వం సీరియస్ అయ్యింది. మాజీ ఎమ్మెల్యే ఇంద్రసేనారెడ్డి అసమ్మతి నేతలతో చర్చించారు. భవిష్యత్తులో ఈ రకంగా అసమ్మతి సమావేశాలు నిర్వహించవద్దని సూచించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీరుపైనే అసమ్మతి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. 

గతంలో నిర్వహించిన సమావేశాలపై బీజేపీ నాయకత్వం సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. కొందరిపై పార్టీ నాయకత్వం చర్యలు తీసుకొంటారనే చర్చ కూడా సాగింది. కానీ అసమ్మతి నేతలపై చర్యలు తీసుకోలేదు. దీంతో మరోసారి అసమ్మతి నేతలు మరోసారి సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశంపై పార్టీ నాయకత్వం ఏ రకంగా చర్యలు తీసుకొంటుందనేది ప్రస్తుతం చర్చ సాగుతుంది. 

ఈ ఏడాది జనవరి మాసంలో అసమ్మతి నేతలు సమావేశమయ్యారు. గత పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీ తమను పట్టించుకోవడం లేదని కరీంనగర్ జిల్లా స్థానిక నేతలు ఆరోపణలు చేస్తున్నారు. బండి సంజయ్ స్థానిక కార్యక్రమాలకు తమకు సమాచారం ఇవ్వడం లేదని, కొత్తగా పార్టీలో చేరిన వారికి ఇచ్చిన గుర్తింపు తమకు దక్కడం లేదని ఆత్మగౌరవ సమావేశం నిర్వహించారు. 

పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే అంశంపై పలువురు సీనియర్ నేతలు రహస్యంగా మీటింగ్ నిర్వహించగా, వీరందరినీ కరీంనగర్ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు అర్జున్రావు కోఆర్డినేట్ చేసినట్లుగా అప్పట్లో ప్రచారం సాగింది. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, బీజేపీ కిసాన్మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్రావు తదితరులు ఈ సమావేశంలో కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. ఈ విషయం పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లడంతో తాము నిర్వహించిన భేటీ వెనుక ఆంతర్యం వేరని అసమ్మతి నేతలు పార్టీ నాయకత్వానికి తేల్చి చెప్పారు. 

 ఈ నేపథ్యంలోనే వారంతా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కూడా కలిసినట్లుగా అప్పట్లో ప్రచారం సాగింది. అయితే ఈ అంశాన్ని హైకమాండ్ సీరియస్‌గా తీసుకున్న నేపథ్యంలో వారిపై వేటు తప్పదని పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే మరోసారి అదే తరహాలో సమావేశం కావడంతో పార్టీ నాయకత్వం ఏ రకమైన చర్యలు తీసుకొంటుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.