సంజీవయ్య పార్క్ పేరు వినపడగానే ముందు ప్రేమికులే గుర్తుకు వస్తారు. సెలవు రోజుల్లో ఎక్కువ మంది ప్రేమికులు అక్కడ కూర్చొని కాలక్షేపం చేసేవారు. కాగా... ఇక నుంచి ఈ పార్క్ చిన్నపిల్లల పార్క్ గా మారనుంది. హుస్సేన్ సాగర్ తీరాన 92ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ సంజీవయ్య పార్క్ లో 14ఏళ్ల లోపు చిన్నారులను మాత్రమే అనుమతిచంాలని హైదరాబాద్ మహానగరాభివృద్ధి బుద్ధి పూర్ణిమ ప్రాజెక్టు అథారిటీ నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్ నగరానికి వచ్చిన ఇతర రాష్ట్రాలు,దేశాల సందర్శకులు సాగర్ తీరాన ఉన్న ఈ పార్క్ ను సందర్శిస్తుండటం, అలాగే పిల్లలతో కలిసి వచ్చిన కుటుంబసభ్యులకు ఇక్కడ ప్రేమ జంటలు చేసే చేష్టలపై బీపీపీఏ అధికారులకు ఫిర్యాదులు పోటెత్తాయి. దీంతో అధికారులు ఈ చర్యలకు ఉపక్రమించారు.

ఇప్పటికే ఈ పార్క్ లోకి  రోజూ వస్తున్న జంటలు వందల సంఖ్యలో ఉన్నాయి. వీరి ప్రవర్తిన శృతిమించి తారాస్థాయికి చేరుకుందని.. పోలీసు స్టేషన్ వరకు ఫిర్యాదులు వెళ్లిన సంఘటనలు ఉన్నాయి. ఇన్ని రోజులు ఆదాయం కోసం అధికారులు కూడా ఎవరు ఏం చేసినా... చూసీ చూడనట్లు వ్యవహరించారు. ఫిర్యాదులు మరీ ఎక్కువ కావడంతో అధికారులు చర్యలు తీసుకోక తప్పలేదు.

సంజీవయ్య పార్కుతో పాటుగా హెర్బల్‌ పార్క్, బటర్‌ ఫ్లై పార్కు, రోజ్‌ గార్డెన్, జాతీయ జెండా తదితర ప్రాంతాలన్నింటిని కలిపి సంజీవయ్య పిల్లల ఉద్యానవనంగా మారిస్తే బాగుంటుందన్న ఆయన ప్రతిపాదనను హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అరవింద్‌ కుమార్‌  ముందుంచడంతో పచ్చజెండా ఊపారు. పిల్లల్లో సైన్స్‌పై ప్రాక్టికల్‌గా అవగాహన కలిగించేందుకు ఇది ఎంతో దోహదం కానుంది. కేవలం 14 సంవత్సరాలలోపు చిన్నారులకు మాత్రమే అనుమతి ఉంది. చిన్నారులతో వారి తల్లిదండ్రులు, పెద్దలు కూడా రావొచ్చు.