Asianet News TeluguAsianet News Telugu

తప్పిన కేసీఆర్ లెక్క.....ఎన్నికల్లో కనిపించని లక్కీ నంబర్

ఏదైనా పని చేపట్టినప్పుడు వాస్తు, లక్కీ నంబర్, ముహూర్తం చూసుకోవడం ప్రతీ ఒక్కరి సెంటిమెంట్ గా మారింది. ఈ సెంటిమెంట్ రాజకీయరంగంలో బాగా వినిపిస్తుంది. కనిపిస్తుంది కూడా. పార్టీలో చేరినప్పుడు నుంచి స్టార్ట్ అయ్యే సెంటిమెంట్ లక్కీ నంబర్లు చివరికి తమ రాజకీయ ప్రస్థానం వరకు కొనసాగుతూనే ఉంది. 

No KCR's lucky number in Telangana Election schedule
Author
Hyderabad, First Published Oct 6, 2018, 4:53 PM IST


హైదరాబాద్: ఏదైనా పని చేపట్టినప్పుడు వాస్తు, లక్కీ నంబర్, ముహూర్తం చూసుకోవడం ప్రతీ ఒక్కరి సెంటిమెంట్ గా మారింది. ఈ సెంటిమెంట్ రాజకీయరంగంలో బాగా వినిపిస్తుంది. కనిపిస్తుంది కూడా. పార్టీలో చేరినప్పుడు నుంచి స్టార్ట్ అయ్యే సెంటిమెంట్ లక్కీ నంబర్లు చివరికి తమ రాజకీయ ప్రస్థానం వరకు కొనసాగుతూనే ఉంది. 

తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ కు సెంటిమెంట్ కాస్త ఎక్కువే అని చెప్పుకోవాలి. ఏ కార్యక్రమం తలపెట్టినా కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ. అలాగే లక్కీ నంబర్ రోజే ఏ కార్యక్రమం అయినా కేసీఆర్ చేపడతారు అనేది బహిరంగ రహస్యం. 

ఇంతకీ కేసీఆర్ లక్కీ నంబర్ ఎంటి అనుకుంటున్నారా....ఆరు. తన లక్కీ నంబర్ 6 అని అనేక సందర్భాల్లో కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. ఏ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినా కేసీఆర్ తన లక్కీ నంబర్ కు ప్రాధాన్యత ఇస్తారన్నది వాస్తవం. 

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో పోరాటాలు చేశారు కేసీఆర్. ఆఖరికి ప్రాణాలను పణంగా పెట్టి ఆమరణ నిరాహార దీక్ష సైతం చేశారు. మెుత్తానికి కేంద్రం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్యభూమిక పోషించిన కేసీఆర్ కు 2014 ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు.టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టి కేసీఆర్ ను ముఖ్యమంత్రి పీఠంలో కూర్చొబెట్టారు. 

తెలంగాణ ప్రజలు ఎంతో ఇష్టంగా ఎన్నుకున్న ముఖ్యమంత్రి పదవిని సైతం వదులుకున్నారు. ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యారు. అందుకు తెలంగాణ అసెంబ్లీని రద్దు చేశారు. తెలంగాణ అసెంబ్లీని కూడా రద్దు చేసింది సెప్టెంబర్ 6న. అంటే తన లక్కీ నంబర్ రోజునే తెలంగాణ అసెంబ్లీని రద్దు చేశారు. 

ఇకపోతే రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామన్న ధీమాతో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. అంటే గెలుపు గుర్రాలకు సంబంధించి ఎంతటి కసరత్తు చేశారో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ అసెంబ్లీ రద్దు ప్రకటించిన సెప్టెంబర్ 6నే అభ్యర్థుల జాబితాను సైతం ప్రకటించారు కేసీఆర్. 119 స్థానాలకు గానూ 105 మంది అభ్యర్థులను తొలివిడతగా ప్రకటించారు. అంటే వన్ ప్లస్ 5 మెుత్తం 6 నంబర్ కలిసేలా ప్లాన్ చేశారు. 

అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సైతం తన లక్కీ నంబర్ కలిసొచ్చే రోజునే ఉంటాయని కేసీఆర్ పదేపదే భావించారు. జ్యోతిష్యులు చెప్పినట్లు నవంబర్ నెలలో ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా గెలుస్తామని ఆలోగానే ఎన్నికలు జరుగుతాయని కేసీఆర్ ఆశించారు. 

అంతేకాదు ఒక అడుగుముందుకేసీ నవంబర్ 24న ఎన్నికలు జరిగే అవకాశం ఉందని గతంలో జోస్యం కూడా చెప్పారు. 2ప్లస్ 4 అంటే నవంబర్ 24లో 6 కలిసి వచ్చింది కాబట్టి ఆరోజు ఎన్నికలు జరిగినా గెలుపు తథ్యమని కేసీఆర్ లెక్కలు వేసుకున్నారు. 

ఒకవేళ నవంబర్ 24 లెక్కతప్పితే డిసెంబర్ 6న కచ్చితంగా ఎన్నికలు జరుగుతాయని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అదే తేదీని కన్ఫమ్ చేస్తూ టీఆర్ఎస్ నేతలు ప్రచారం కూడా చేపట్టేశారు. ఆ లెక్క కూడా తప్పడంతో టీఆర్ఎస్ నేతల జాతకంపై పునరాలోచనలో పడ్డట్లున్నారు. 

కానీ కేసీఆర్ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో వేసుకున్న అంచనాలు పటాపంచలయ్యాయి. కేసీఆర్ ఊహించినట్లు నవంబర్ లో కాకుండా డిసెంబర్ లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అది కూడా డిసెంబర్ 7న. ఫలితాలు వెల్లడయ్యే తేదీలో కూడా కేసీఆర్ అదృష్ట సంఖ్య ఆరు కలిసిరాలేదు. డిసెంబర్ 11న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. 

మెుత్తానికి ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ఊహించినట్లు ఎన్నికల షెడ్యూల్ లేకపోవడం ఆ పార్టీ నేతలను కాస్త అసహనానికి గురి చేసినట్లేనని తెలుస్తోంది. నవంబర్ అనుకున్నది డిసెంబర్ లో జరుగుతుండటం, ఆరు కాస్త ఏడు అవ్వడంతో ఏం జరుగుతుందోనని ఇతర పార్టీ నేతలు సైతం కేసీఆర్ లెక్కలు తప్పుతాయా అన్న సందేహం వెలబుచ్చుతున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios