హైదరాబాద్: తెలంగాణ తాత్కాలిక సచివాలయంలోకి మీడియాను బ్యాన్ చేశారు. దీంతో తమకు అనుమతి ఇవ్వాలని  మీడియా ప్రతినిధులు సీఎస్ ఎస్‌కె జోషీకి వినతి పత్రం సమర్పించారు. అంతేకాదు మీడియాను అనుమతి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ సచివాలయ తాత్కాలిక భవనం ముందు మౌనంగా నిరసన చేశారు.

తెలంగాణ సచివాలయ భవనాన్ని కూల్చివేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారు.దీంతో ఆయా హెచ్ఓడి కార్యాలయాలకు మంత్రుల కార్యాలయాలు, సెక్రటరీల కార్యాలయాలను తరలించారు.

బూర్గుల రామకృష్ణారావు భవనాన్ని తాత్కాలిక సచివాలయ భవనంగా ఉపయోగిస్తున్నారు.అయితే తాత్కాలిక సచివాలయ భవనంలోకి మీడియాను అనుమతించడం లేదు. సమాచార సేకరణ కోసం తాత్కాలిక సచివాలయ భవనంలోకి వెళ్లేందుకు పాస్ జారీ చేయాలని లేదా అనుమతి ఇవ్వాలని మీడియా ప్రతినిధులు కోరారు.

ఈ విషయమై శుక్రవారం నాడు మీడియా ప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషిని కలిసి  వినతి పత్రం సమర్పించారు. తాత్కాలిక సచివాలయ భవనంలో సమాచార సేకరణ కోసం తమకు అనుమతి ఇవ్వాలని కోరారు.

తెలంగాణ ఉద్యమం సమయంలో తాము ప్రత్యక్షంగా పాల్గొన్న విషయాన్ని కూడ జర్నలిస్టులు ఈ వినతిపత్రంలో ప్రస్తావించారు. సమాచార సేకరణకు తమకు ఆటంకం కల్గించవద్దని కోరారు.

గతంలో కూడ  సచివాాలయ భవనంలోకి మీడియాను అనుమతి విషయమై ఆంక్షలు విధించాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా వార్తలు వచ్చాయి.ఆ సమయంలో జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆ రకమైన ప్రతిపాదన జరగలేదనీ సీఎంఓ అధికారులు వివరణ ఇచ్చారు.  ప్రస్తుతం తాత్కాలిక సచివాలయంలో స్థలం లేదనే కారణంగా జర్నలిస్టులకు అనుమతి నిరాకరిస్తున్నారనే ప్రచారం లేకపోలేదు.