అవసరమైతే కత్తి మహేష్‌ను రాష్ట్రం నుండి బహిష్కరిస్తాం: డీజీపీ మహేందర్ రెడ్డి

No compramise on Law and order issue says Dgp Mahender Reddy
Highlights

అవసరమైతే రాష్ట్రం నుండి కత్తి మహేష్ ను బహిష్కరిస్తామని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం  ఆరు మాసాల పాటు నగరం నుండి కత్తి మహేష్ ను బహిష్కరించినట్టు డీజీపీ తెలిపారు.

హైదరాబాద్:సినీ విమర్శకులు కత్తి మహేష్‌ను ఆరు మాసాల పాటు నగరం నుండి బహిష్కరించినట్టు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు.అవసరమైతే కత్తిమహేష్ ను రాష్ట్రం నుండి కూడ బహిష్కరిస్తామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన చెప్పారు.

సోమవారం నాడు హైద్రాబాద్‌లో డీజీపీ పి. మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. భావ వ్యక్తీకరణ పేరుతో వివాదాస్పద ప్రకటనలు చేయకూడదని ఆయన కోరారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారికి సహకరించేవారికి కూడ శిక్షలు విధించనున్నట్టు ఆయన చెప్పారు.

కొందరు సమాజంలో అశాంతిని నెలకొల్పేందుకు కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. కత్తి మహేష్ నగరానికి వస్తే మూడేళ్లపాటు శిక్ష విధించే అవకాశం ఉంటుందని చెప్పారు. కత్తి మహేష్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా నేరమేనని ఆయన తెలిపారు.

తెలంగాణ అభివృద్ధిని కొరుకొనే వారు ఈ రకమైన వ్యాఖ్యలు చేయరని ఆయన అభిప్రాయపడ్డారు. కత్తిమహేష్ ను అవసరమైతే రాష్ట్రం నుండి కూడ బహిష్కరిస్తామని మహేందర్ రెడ్డి చెప్పారు. నగరంలో ఎవరైనా ఉండొచ్చని చెప్పారు. కానీ, శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తే చర్యలు తీసుకొంటామని ఆయన తెలిపారు.

ప్రోగ్రాం కోడ్ ను ఉల్లంఘించిన చానెల్ కు కూడ నోటీసులు జారీ చేసినట్టు డీజీపీ తెలిపారు. కేబుల్ టీవీ చట్టాలను ఉల్లంఘించే యాజమాన్యాలపై చర్యలు తీసుకొంటామని ఆయన చెప్పారు.

మెజార్టీ ప్రజల మనోభావాలను రెచ్చగొట్టొద్దని డీజీపీ తెలిపారు. ఏపీ పోలీసులతో కూడ కత్తి మహేష్ విషయమై చర్చిస్తున్నట్టు మహేందర్ రెడ్డి తెలిపారు.శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. ఒకరిద్దరూ వ్యక్తులు మీడియా వేదికగా కులాలు, మతాల మధ్య విమర్శలు చేస్తున్నారని ఆయన చెప్పారు. ఈ పద్దతులు మానుకోవాలని ఆయన సూచించారు.


 

loader