కేసీఆర్‌కి బండి సంజయ్ సవాల్:యాదాద్రి ఆలయానికి వెళ్లే విషయమై రాని స్పష్టత
కేసీఆర్ పై విసిరిన సవాల్ లో భాగంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి బండి సంజయ్ వెళ్లే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. మునుగోడు నియోజకవర్గంలోని మరో లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బండి సంజయ్ వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు.
హైదరాబాద్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రమాణం చేసేందుకు వెళ్తారా లేదా అనే విషయమై స్పష్టత రాలేదు. శుక్రవారం నాడు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు తాను యాదాద్రి ఆలయం వద్ద సీఎం కేసీఆర్ కోసం ఎదురు చూస్తానని బండి సంజయ్ ప్రకటించారు. అయితే ఇవాళ ఉదయం 9 గంటల వరకు కూడా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని మర్రిగూడలోనే బండి సంజయ్ ఉన్నారు.
తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు నేతలు గురి చేసిందని టీఆర్ఎస్ ఆరోపించింది. ఈ ఆరోపణలపై యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో శుక్రవారం నాడు ప్రమాణం చేసేందుకు రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ కు నిన్న సవాల్ చేసిన విషయం తెలిసిందే.యాదాద్రి లక్ష్మీ నరసింహాస్వామి ఆలయానికి ప్రమాణం చేసేందుకు కేసీఆర్ రాకపోతే ఈ డ్రామా వెనుక కేసీఆరే ఉన్నారని భావించాల్సి వస్తుందని కూడా బీజేపీ ప్రకటించింది.
మొయినాబాద్ ఫాంహౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో ముగ్గురిని మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేశారనే విషయమై తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీకి చెందిన రామచంద్ర భారతి అలియాస్ సతీష్ శర్మ,తిరుపతికి చెందిన సింహయాజీ, హైదరాబాద్ కు చెందిన నందులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి వీరిని సరూర్ నగర్ లోని మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు.. వీరిపై పీడీ యాక్ట్ వర్తించదని నిన్న రాత్రి జడ్జి చెప్పారు. ముగ్గురు నిందితులను విడుదల చేయాలని ఆదేశించారు. అంతేకాదు 41 సీఆర్‌పీసీ సెక్షన్ కింద విచారణ చేయాలని జడ్జి ఆదేశించారు. దీంతో బీజేపీ నాయకత్వం కూడ తమ వ్యూహం మార్చుకొందనే ప్రచారం సాగుతుంది. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రమాణం చేసేందుకు రావాలని సీఎం కేసీఆర్ కు చేసిన సవాల్ పై టీఆర్ఎస్ నాయకత్వం నుండి ఎలాంటి రెస్పాన్స్ రాని విషయాన్ని కూడ బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు.
also read :ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టిన కేసులో నిందితుల విడుదలకు ఆదేశాలు.. రిమాండుకు నిరాకరణ..
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బండి సంజయ్ వెళ్లేందుకు ప్రయత్నిస్తే పోలీసులు అదుపులోొకి తీసుకొనే అవకాశం లేకపోలేదు.దీంతో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని నాంపల్లి మండలంలో గల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రమాణం చేసేందుకు బండి సంజయ్ భావిస్తున్నారని ప్రముఖ తెలుగు న్యూస్ చానలెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.