తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ వద్ద పెండింగ్ బిల్లలు ఉన్నాయనే ప్రచారంపై రాజ్‌భవన్‌ వర్గాలు స్పందించాయి. గవర్నర్ వద్ద ఎలాంటి బిల్లులు పెండింగ్‌లో లేవని రాజ్‌భవన్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ వద్ద పెండింగ్ బిల్లలు ఉన్నాయనే ప్రచారంపై రాజ్‌భవన్‌ వర్గాలు స్పందించాయి. గవర్నర్ వద్ద ఎలాంటి బిల్లులు పెండింగ్‌లో లేవని రాజ్‌భవన్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ‘‘రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులలో మూడు క్లియర్ చేయబడ్డాయి. రెండు భారత రాష్ట్రపతి కార్యాలయానికి సిఫార్సు చేయబడ్డాయి. మిగిలిన బిల్లులు తగిన వివరణలు, సమాచారాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి పంపబడ్డాయి’’ అని రాజ్‌భవన్ తెలిపింది. 

రాజ్‌భవన్ వద్ద బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్టుగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. గవర్నర్‌కు సంబంధించిన ఏవైనా వార్తలను ప్రసారం చేసే ముందు అధికారికంగా రాజ్‌భవన్ నుండి వివరణ కోరాలని సూచించింది. ఈ మేరకు రాజ్‌భవన్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. 

ఇదిలా ఉంటే, పెండింగ్‌లో ఉన్న బిల్లులకు ఆమోదం తెలిపేలా గవర్నర్‌ను ఆదేశించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మార్చి 2న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2022 సెప్టెంబర్ 14 నుంచి రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లులు చాలా కాలంగా గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. అయితే రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులు ఏవీ తన వద్ద పెండింగ్‌లో లేవని ఏప్రిల్ 24న గవర్నర్ సుప్రీంకోర్టుకు తెలిపారు.

ది యూనివర్శిటీ ఆఫ్ ఫారెస్ట్రీ తెలంగాణ బిల్లు, 2022, తెలంగాణ యూనివర్శిటీల కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ బిల్లు, 2022 అనే రెండు బిల్లులను భారత రాష్ట్రపతి పరిశీలన, ఆమోదం కోసం పంపినట్లు ఆమె తెలిపారు. ఇక, తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ (సవరణ) బిల్లు, 2022 తిరస్కరించబడింది.

ఇక, తెలంగాణ పంచాయతీ రాజ్ (సవరణ) బిల్లు, 2023, అజామాబాద్ పారిశ్రామిక ప్రాంతం (టర్మినేషన్ మరియు లీజుల నియంత్రణ) (సవరణ) బిల్లు 2022లపై కొన్ని అభ్యంతరాలను లేవనెత్తుతూ, వాటిని సరిదిద్దాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి పంపబడ్డాయి. మరోవైపు తెలంగాణ మోటారు వాహనాల పన్ను (సవరణ) బిల్లు, 2022, తెలంగాణ మునిసిపాలిటీలు (సవరణ బిల్లు), 2023, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (సవరణ) బిల్లు, 2023 బిల్లులను గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌ ఆమోదించారు.