కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లు ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈబిసిలకు 10శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్రం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బిల్లు ఉభయసభల ఆమోదం పొందింది.  కేంద్ర ప్రభుత్వం తక్కువ సమయంలోనే ఈ బిల్లును పాస్ చేయించుకోడానికి చూపించిన చిత్తశుద్దిపై వివిధ రాజకీయ పక్షాల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 

ఈ ఈబిసి రిజర్వేషన్లపై నిజామాబాద్ ఎంపి కవిత కాస్త విచిత్రంగా స్పందించారు. ఓ వైపు ఈ బిల్లు వేగంగా ముందుకు కదిలి ఉభయ సభల ఆమోదం పొందడాన్ని ప్రశంసిస్తూనే మహిళా బిల్లుపై కేంద్రాన్ని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ఈబిసి బిల్లు మాదిరిగా వేగంగా ఉభయసభల్లో పాస్ అయితే బావుంటుందన్నారు. అప్పుడే దేశం నిజంగా
అభివృద్ది చెందుతుందని పేర్కొన్నారు. మహిళా బిల్లు సాధన కోసం మరిన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలని కవిత స్పష్టం చేశారు. 

ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఈబిసి రిజర్వేషన్లను స్వాగతిస్తూనే...తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి పంపించిన మైనారిటీ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపు బిల్లును కూడా పార్లమెంట్ లో ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా కవిత మహిళా బిల్లును కేంద్ర ముందుకు తీసుకువచ్చారు.