Asianet News TeluguAsianet News Telugu

కూటమి నేతల హామీలపై కవిత పిట్టకథ (వీడియో)

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా జట్టుకట్టిన ప్రజాకూటమి ఓటమి భయంతోనే ప్రచారం నిర్వహిస్తోందని నిజామాబాద్ ఎంపి కవిత అన్నారు. జగిత్యాల నియోజకవర్గంలోని రాయికల్ మండలం ఇటిక్యాలలో టీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్ కి మద్దతుగా కవిత రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత ప్రసంగిస్తూ....  కూటమిలోని పార్టీలు తమ అభ్యర్థుల గెలుపు కోసం ఆపద మొక్కులు మొక్కుతున్నాయని  ఎద్దేవా చేశారు.   

nizamabad mp kavitha roadshow at jagityal
Author
Jagtial, First Published Dec 1, 2018, 4:43 PM IST

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా జట్టుకట్టిన ప్రజాకూటమి ఓటమి భయంతోనే ప్రచారం నిర్వహిస్తోందని నిజామాబాద్ ఎంపి కవిత అన్నారు. జగిత్యాల నియోజకవర్గంలోని రాయికల్ మండలం ఇటిక్యాలలో టీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్ కి మద్దతుగా కవిత రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత ప్రసంగిస్తూ....  కూటమిలోని పార్టీలు తమ అభ్యర్థుల గెలుపు కోసం ఆపద మొక్కులు మొక్కుతున్నాయని  ఎద్దేవా చేశారు.

nizamabad mp kavitha roadshow at jagityal  

ప్రజా కూటమి ఆపద మొక్కులను కవిత ఓ కథ రూపంలో వివరించారు.  ''ఓ దర్జీ బట్టలు కుడుతుండగా సూది కిందపడిపోయింది. అతడు ఎంత వెతికినా ఆ సూది  దొరక్కపోవడంతో... దేవుడా సూది దొరుకితే అందరికీ కిలో పంచదార పంచి పెడతానని మొక్కుకున్నాడు. ఇది విన్న ఆయన భార్య సూదికోసం కిలో పంచదార పంచి పెట్టడం  ఏంటని ప్రశ్నించింది. దీంతో సదరు దర్జీ తన భార్యకు ఇలా చెప్పాడు... దేవుడు చాలా మంచి వాడు...సూది దొరికితే పంచదార పంచక పోయినా దేవుడు ఏమనుకోడులే.. అని అన్నాడు. కూటమి నేతలు చెప్తున్న మాటలు, హామీలు కూడా అలాగే ఉన్నాయి.'' అంటూ కవిత తెలిపారు.  

కేసీఆర్ కు ప్రజల కష్టాలు తెలుసునని, అడక్కుండానే అన్ని పనులు ఆయన చేస్తారని తెలిపారు. ఇది చేస్తాం ..అది చేస్తాం.. అని వాగ్దానాలు చేసిన వారు కనపడకుండా పోయిన విషయం మీకు తెలుసిందేనని కవిత అన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ  సంజయ్ మీ వెంటే ఉంటూ మీకు అండదండగా ఉంటున్నారని కవిత గుర్తు చేశారు.

ఇటిక్యాలలో ప్రస్తుతం 14 వందల మందికి పెన్షన్లు వస్తున్నాయని... గతంలో ఎన్ని పెన్షన్లు వచ్చేవని కవిత ప్రజలను ప్రశ్నించారు. ఇప్పుడు ఇస్తున్న పెన్షన్ల లో పావు వంతు కూడా రాలేదని తెలిపారు. టిఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తే 58 ఏళ్ల వయస్సు ఉన్న వారికి కూడా పెన్షన్లను ఇస్తామని...వెయ్యి రూపాయల పెన్షన్ రూ.2000, వికలాంగులకు ఇస్తున్న రూ.1500 పెన్షన్ ని మూడు వేలకు పెంచుతామని చెప్పారు.అలాగే నిరుద్యోగులకు ప్రతి నెల మూడు వేల రూపాయలు భృతిగా చెల్లిస్తారని తెలిపారు. జాగాలు ఉన్నవారికి డబుల్ బెడ్ రూమ్లకు అవుతున్న ఖర్చు మొత్తాన్ని నేరుగా వారి అకౌంట్లో వేస్తారని... జాగాలు లేనివారికి డబుల్ బెడ్ రూమ్ లలో అవకాశం కల్పిస్తామని కవిత వివరించారు. 

ఎమ్మెల్యే జీవన్ రెడ్డి జాగాలేని చోట డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చేపట్టారని... ఇండ్ల నిర్మాణం జరగవద్దనేది ఆయన ఆలోచన అని కవిత విమర్శించారు. బీసీలు, ఎంబీసీలు, ఎస్సీలు ఆర్థికంగా బలపడడం కోసం బ్యాంకులతో సంబంధం లేకుండా ప్రభుత్వమే నేరుగా రుణాలను ఇచ్చేలా కేసీఆర్ కార్యాచరణ రూపొందించారని, పేదలందరి సంక్షేమం కోసం ఆయన ఆలోచిస్తున్నారని కవిత తెలిపారు. 
 
మూటపల్లి రైతులను ఆగం చేసే పనిలో కూటమి అభ్యర్థులు ఉన్నారని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు ఎంపీ కవిత. టిఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తే రైతులకు నీళ్లు ఇవ్వరని దుష్ప్రచారం చేస్తున్నారని, రైతుల్లో అభద్రతను పెంచుతున్నారని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ఎస్ఆర్ఎస్‌పి లో నీళ్లు పుష్కలంగా ఉన్నాయని నీళ్లు ఇచ్చే బాధ్యత నాదే అని ఎంపీ కవిత రైతులకు హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు తెలంగాణలో చక్రం తిప్పేందుకు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారని తెలిపారు. మనకు నీళ్ల పంచాయతీ వస్తే ఆయన మనకు న్యాయం చేస్తాడా... ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేస్తాడా.. అనే విషయం ఆలోచించుకోవాలని రైతులను కోరారు.  

అందువల్ల కారు గుర్తుకు ఓటు వేసి టిఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఈ రోడ్ షో లో జగిత్యాల అభ్యర్థి  సంజయ్ పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

వీడియో

 

Follow Us:
Download App:
  • android
  • ios