న్యూఢిల్లీ: ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి హస్తినలో పలువురు కేంద్రమంత్రులు, వివిధ శాఖల అధికారులు, బీజేపీ నేతలతో భేటీ అయ్యారు.  

కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి  నరేంద్రసింగ్ తోమర్ తో వరుసగా రెండుసార్లు భేటీ అయ్యారు. నిజామాబాద్ ప్రాంత రైతాంగం, గ్రామీణాభివృద్ధి విషయాలపై చర్చించినట్లు తెలిపారు. రైతాంగ, గ్రామీణాభివృద్ధి విషయాలపై కేంద్రమంత్రి తోమర్ సానుకూలంగా స్పందించారని స్పష్టం చేశారు. 

అలాగే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సెప్టెంబర్ 6న కేంద్రమంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్  ప్రారంభించనున్న అగ్రిపార్క్ ప్రారంభోత్సవానికి హాజరుకావాలని ఆహ్వానించారు.  

అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ సహాయ మంత్రి రామేశ్వర్ తెలితో కూడా అర్వింద్ భేటీ అయ్యారు. అగ్రిపార్క్ ప్రారంభోత్సవానికి హాజరుకావాల్సిందిగా కోరారు. మరోవైపు ఫుడ్ ప్రాసెసింగ్ సెక్రెటరీ పుష్ప సుబ్రహ్మణ్యంతోపాటు పలువురు వ్యవసాయశాఖలోని అధికారులను కలిశారు.  

పార్టీ పరంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్ లతోపాటు జాతీయ కార్యదర్శి సునీల్  ధియోధర్ లతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పార్టీ సమస్యలపై చర్చించారు.