తెలంగాణ పోలింగ్ కు ముందురోజు తనపై జరిగిన దాడి గురించి కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎంపి మధు యాష్కి స్పందించారు. హైదరాబాద్ నుండి నిజామాబాద్ కు వెళుతుండగా మార్గమధ్యలో మెట్ పల్లిలో తనపై దాడి జరిగిందన్నారు. అయితే ఇది కేవలం దాడి మాత్రమే కాదని....టీఆర్ఎస్ పార్టీ తనను చంపడానికి చేసిన ప్రయత్నమని ఆరోపించారు. 

స్థానిక నాయకుడు కొమ్మిరెడ్డి రాములు అనుచరుల పేరుతో టీఆర్ఎస్ కార్యకర్తలే తనపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. మూడు రోజుల  క్రితమే తనపై దాడికి ప్లాన్  జరిగిందన్నారు. ఈ ఘటన తర్వాత ఎంపి కవిత స్థానిక మాజీ ఎమ్మెల్యే‌తో పాటు కొమ్మి రెడ్డి రాములుకు ఫోన్ చేసినట్లు తమకు సమాచారం ఉందని మధుయాష్కి ఆరోపించారు.  

తెలంగాణలో నాలుగున్నరేళ్ల కల్వకుంట్ల కుటుంబ పాలనకు కాలం చెల్లిందని నిన్నటి ఓట్ల సరళిని బట్టి చూస్తే తెలుస్తోందని యాష్కి అన్నారు. తెలంగాణ ఆకాంక్షను అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చి మళ్లీ గడీల పాలన తీసుకువచ్చిన వారిని ప్రజలు వ్యతిరేకించారని తెలిపారు. గత ఎన్నికల్లో తమకు ప్రాతినిధ్యం కూడా లేని జిల్లాల్లో కూడా ఈసారి అధికంగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. 

తమ కూటమిపై నమ్మకంతో ప్రజా యుద్ద నౌక గద్దర్ మొదటి సారి ఓటు వేయడం జరిగిందన్నారు  ప్రజాస్వామ్యాన్ని కాపాడాటానికే ఆయన ఓటేశారని తెలిపారు. అలాగే మంద కృష్ణ మాదిగ కూడా తమ కూటమి పక్షాన నిలవడం చాలా ఉపయోగపడిందన్నారు. 

శుక్రవారం పోలింగ్ తర్వాత వెలువడిన ఎగ్జిట్ పోల్ సర్వేలపై మధుయాష్కి మాట్లాడుతూ....మొదటినుండి కాంగ్రెస్ పార్టీ అధికారికంగా కూడా ఎలాంటి పోల్స్‌ని పట్టించుకోలేదన్నారు. లగడపాటి రాజగోపాల్ సర్వే అటుంచితే...తెలంగాణ ను వ్యతిరేకించిన వ్యక్తితో కేటీఆర్ సత్సంబంధాలను నెరపడం సిగ్గుచేటని యాష్కి విమర్శించారు. 

 తిరిగి కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం దేశంలో, రాష్ట్రంలో వచ్చే అవకాశం ఉందని నిన్నటి పోలింగ్ సరళి చెబుతోందన్నారు. భారీగా ఓటింగ్ లో పాల్గొన్న ఓటర్లకు యాష్కి  కృతజ్ఞతలు తెలిపారు. 11 తారీఖు పలితాల కోసం తాము కూడా ఎదురుచూస్తున్నామని అన్నారు. ఆ రోజు తప్పకుండా ప్రజా కూటమికి అనుకూలమైన తీర్పు వస్తుందని భావిస్తున్నట్లు యాష్కి ధీమా వ్యక్తం చేశారు.