తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ పేద మహిళల ఉసురు పోసుకుంటున్నారని.. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టిస్తానంటూ పెద్ద పెద్ద ప్రసంగాలు చేసిన ఆయన నిజామాబాద్‌లో ఒక్క ఇల్లు కూడా కట్టలేదన్నారు.

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణంలో కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని అర్వింద్ ఆగ్రహం వయక్తం చేశారు. తెలంగాణలో పేదల కోసం కేంద్ర ఆవాస్ యోజన పథకం కింద ఇచ్చిన వేల కోట్ల నిధులను కేసీఆర్ పక్కదారి పట్టించారని అర్వింద్ ఆరోపించారు.

Also Read:మరో మెట్టు పైకి: తెలంగాణ డిప్యూటీ సీఎంగా కేటీఆర్?

కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రావాల్సి ఉన్నా.. వివరాలు ఇవ్వకుండా వాటిని నిలిపి వేసుకున్నారని ఆయన మండిపడ్డారు. 2016-17 ఆర్ధిక సంవత్సరంలో మొదటి విడత కింద కేంద్రం 190.79 కోట్ల రూపాయలను ఇస్తే ఒక్క మహిళకు కూడా కేసీఆర్ ప్రభుత్వం ఇల్లు కట్టించలేదని అర్వింద్ మండిపడ్డారు.

ఈ పథకం కింద ఎన్ని ఇళ్లు కట్టించారు, ఎన్ని నిధులు ఖర్చు చేశారో గత నాలుగేళ్లలో కనీస వివరాలు కూడా ఇవ్వలేదని ఆయన వ్యాఖ్యానించారు. హౌసింగ్ కమిటీ సమావేశానికి తెలంగాణ నుంచి మంత్రి కానీ కనీసం అధికారిని కూడా పంపలేదని అర్వింద్ దుయ్యబట్టారు.

డబుల్ బెడ్ రూమ్ హామీ వల్లనే టీఆర్ఎస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చిందని.. కానీ ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం లేదన్నారు. తాము పర్యటనలకు వెళ్తుంటే మహిళలు ఇల్లు కావాలని అడుగుతున్నారని అర్వింద్ ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read:కేసీఆర్ కేబినెట్లోకి కేరళ ఐజీ లక్ష్మణ్: ఐటి శాఖ అప్పగింత

పక్క రాష్ట్రాల్లో ఈ పథకం కింద వేల ఇళ్లు కట్టుకున్నారని.. కానీ కేసీఆర్ మాత్రం ప్రాజెక్టులు కట్టడానికి లక్షల కోట్లు లోన్ తెచ్చుకుంటున్నారని, ఈ పథకం డబ్బులతో ప్రగతి భవన్ కట్టించుకున్నారని ఆరోపించారు.

ఆయన కోసం ఏకంగా ఆరు నెలల్లోనే ఇల్లు పూర్తయిందన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తానని చెప్పి.. ఆ ఇళ్ల ముందు గొర్రెలు, బర్రెలు, ఆయన కొడుకును కట్టేసుకోవచ్చునని పెద్దగా మాట్లాడారని అర్వింద్ గుర్తుచేశారు. ఇళ్లు కట్టకపోయినా... కట్టామని చెబుతున్నారని, ఇళ్లు కడితే మరి ఎక్కడ కట్టారు.. గాల్లో కట్టారా లేక ఆయన ఫామ్‌ హౌస్‌లో కట్టారా అని అర్వింద్ ఆరోపించారు.