కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మధ్య లోక్ సభలో సోమవారం మాటల యుద్దం నడిచింది. ప్రశ్నోత్తరాల సమయంలో తెలంగాణ ఎంపీ మాట్లాడే హిందీ బలహీనంగా ఉందని ఆర్థిక మంత్రి చెప్పడంతో ఈ వివాాదం మొదలైంది.
లోక్ సభలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, టీపీసీసీ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి మధ్య సోమవారం మాటల యుద్దం కొనసాగింది. తన హిందీ ప్రావీణ్యం కారణంగా రేవంత్ రెడ్డి తనను తాను ‘‘శూద్రుడు’’ అని పిలుచుకుంటూ కులాన్ని సభలో ప్రస్తావనకు తీసుకొచ్చారు. ఆర్థిక మంత్రి ‘బ్రహ్మణవాది’ కాబట్టి ఆమెకు భాషా ప్రావీణ్యం ఉందని, తాను శూద్రుడిని అని చెప్పుకొచ్చారు.
ప్రశ్నోత్తరాల సమయంలో రూపాయి విలువ మరింత పడిపోకుండా కేంద్రం ఏం చర్యలు తీసుకుంటుందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందని విమర్శించారు. ఈ ప్రశ్నకు నిర్మలా సీతారామన్ సమాధానమిస్తూ తెలంగాణకు చెందిన ఎంపీ హిందీ బలహీనంగా ఉందని చెప్పారు. తాను కూడా బలహీనమైన హిందీలోనే స్పందిస్తానని అన్నారు.
తన హిందీ భాషను ఆర్థిక మంత్రి ఎగతాళి చేయడంపై రేవంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘నేను శూద్రుడిని కావచ్చు. నేను హిందీలో అనర్గళంగా మాట్లాడలేకపోవచ్చు. అయితే ఆమె బ్రాహ్మణవాది. నేను నిమ్న కులానికి చెందినవాడిని కాబట్టే ఆమె నా భాషపై వ్యాఖ్యానించారు.’’ అని అన్నారు. ఈ సమయంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కలుగజేసుకున్నారు. సభలో కులం, మతం విషయాన్ని ప్రస్తావించకూడదని హెచ్చరించారు. ‘సభలో ఇలాంటి పదాలను ఎవరూ ఉపయోగించకూడదు. ఇలా చేస్తే సభ్యుడిపై చర్యలు తీసుకోకతప్పదు’ అని స్పీకర్ అన్నారు.
గతంలో ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐసీయూలో రూపాయి ఉందని చేసిన వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. దీంతో వివాదం రాజుకుంది. ఈ సమయంలో ఒకే ప్రశ్నకు పరిమితం కావాలని ఓం బిర్లా రేవంత్ ను కోరారు. ‘సర్, మీరు నాకు అంతరాయం కలిగించకూడదు’ అని కోరారు. ఈ వ్యాఖ్యలకు స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
దీనిపై లోక్‌సభ కార్యక్రమాల అనంతరం రేవంత్ రెడ్డి ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ‘‘పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విభజన పదజాలాన్ని ఉపయోగించడం విచారకరం. బ్రిటీషర్ల మాదిరిగానే బీజేపీ కూడా విభజించి పాలించే రాజకీయాలను అనుసరిస్తోంది. దేశ ప్రజలను భాష, ఆహారం, కులం, మతం ఆధారంగా విభజించారు.’’ అని ఆయన ట్వీట్ చేశారు.
అంతకుముందు ప్రశ్నోత్తరాల సమయంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్టానికి 83కు చేరుకుందని, అది మరింత పడిపోకుండా కేంద్రం ఎలాంటి ప్రశ్నలకు తీసుకుంటోందని ప్రశ్నించారు. 2014కు ముందు రూ.55,87,149 కోట్ల అప్పులు చేసిన ప్రభుత్వాలతో పోలిస్తే 2014 నుంచి ఎనిమిదేళ్లలో మోదీ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.80,00,744 కోట్లుగా ఉన్నాయని ఆరోపించారు.
మార్కెట్ లో ఆశావాదం క్షీణిస్తున్న సమయంలో పెట్టుబడిదారులలో విశ్వాసాన్ని పెంపొందించడానికి మోడీ ప్రభుత్వం ఒకే విధాన నిర్ణయం తీసుకోవడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. డాలరుతో రూపాయి మారకం విలువ 66 వద్ద ఉన్నప్పుడు అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కరెన్సీ ఇంటెన్సివ్ కేర్ లో ఉందని చెప్పారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ప్రస్తుతం డాలర్‌కు 83.20 వద్ద రూపాయి శవాగారం వైపు పయనిస్తున్నట్లు కనిపిస్తోందని అన్నారు.
ఆయన వ్యాఖ్యలపై ఆర్థిక మంత్రి స్పందిస్తూ.. రూపాయి విలువపై గతంలో మోడీ చేసిన వ్యాఖ్యలను చెప్పిన రేవంత్ రెడ్డి ఆర్థిక సూచికలను కూడా ప్రస్తావించి ఉండాల్సిందని అన్నారు. ‘‘ ఆ సమయంలో ఆర్థిక వ్యవస్థ ఖచ్చితంగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంది. కరోనా మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఉన్నప్పటికీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు.
‘‘దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడం పట్ల కొందరు పార్లమెంటు సభ్యులు అసూయపడటం దురదృష్టకరం. భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉండటం ప్రతిపక్షాలకు సమస్యగా మారింది. భారతదేశ పురోగతి గురించి ప్రతి ఒక్కరూ గర్వపడాలి. కానీ కొందరు దీనిని ఒక జోక్ గా చూస్తారు. అన్ని కరెన్సీల కంటే భారత రూపాయి మంచి పనితీరును కనబరిచింది. డాలర్-రూపాయి హెచ్చుతగ్గులు మితిమీరిపోకుండా చూడటానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన విదేశీ మారక నిల్వలను మార్కెట్ లో జోక్యం చేసుకోవడానికి చేసుకోవడానికి ఉపయోగించుకుంది’’ అని రేవంత్ రెడ్డి బదులిచ్చారు.
