నిర్మల్ మాస్టర్ ప్లాన్: ఏలేటి మహేశ్వర్ రెడ్డి దీక్ష నాలుగో రోజుకు చేరిక, క్షీణిస్తున్న ఆరోగ్యం
నిర్మల్ మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిరహార దీక్ష చేస్తున్నారు. ఆయన దీక్ష ఇవాళ్టికి నాలుగో రోజుకు చేరింది.
నిర్మల్: నిర్మల్ మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆమరణ నిరహార దీక్ష శనివారంనాటికి నాలుగో రోజుకు చేరుకున్నాయి. మహేశ్వర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరీక్షించారు. బీపీ, షుగర్ లెవెల్స్ తగ్గినట్టుగా వైద్యులు చెబుతున్నారు. దీక్షను విరమించాలని మహేశ్వర్ రెడ్డికి వైద్యులు సూచిస్తున్నారు.
నిర్మల్ మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించాలని బీజేపీ పిలుపునిచ్చింది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న ఏలేటి మహేశ్వర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే తాను నిరహారదీక్ష చేస్తానని నాలుగు రోజుల క్రితం మహేశ్వర్ రెడ్డి ప్రకటించారు. నాలుగు రోజులుగా తన నివాసంలోనే దీక్షకు దిగారు మహేశ్వర్ రెడ్డి.
నిర్మల్ మాస్టర్ ప్లాన్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతారని మహేశ్వర్ రెడ్డి చెబుతున్నారు. అధికార పార్టీకి చెందిన నేతలు ఈ మాస్టర్ ప్లాన్ తో ప్రయోజనం పొందుతారని ఆయన ఆరోపించారు.
మంజులాపూర్, తల్వేద వ్యవసాయ భూముల్లోకి మార్చిన ఇండస్ట్రీయల్ జోన్ ను ఎత్తేయకుండానే సోఫినగర్ లోని ఇండస్ట్రీయల్ జోన్ ఎత్తేయడాన్ని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. నిర్మల్ మాస్టర్ ప్లాన్ వెనుక అధికార పార్టీకి చెందిన నేతలున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. నిర్మల్ మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని కోరుతూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇదే డిమాండ్ తో నిన్న నిర్మల్ బంద్ ను నిర్వహించింది బీజేపీ.
అయితే మాస్టర్ ప్లాన్ పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని నిర్మల్ మున్సిపల్ చైర్మెన్ ఈశ్వర్ చెబుతున్నారు. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామని ఆయన చెప్పారు.