ఏఐసీసీ జాబితాలో దొర్లిన తప్పు.. నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుని విషయంలో గందరగోళం..
తెలంగాణ పీసీసీ కొత్త కమిటీలను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. అయితే ఏఐసీసీ విడుదల చేసిన జాబితాలో.. నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుని విషయంలో మాత్రం గందరగోళం నెలకొంది.
తెలంగాణ పీసీసీ కొత్త కమిటీలను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. టీపీసీసీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో 18 మందికి చోటు కల్పించింది. 40 మందితో ఎగ్జిక్యూటివ్ కమిటీని ప్రకటించింది. అలాగే 24 మంది ఉపాధ్యక్షులను, 84 మంది ప్రధాన కార్యదర్శులను, 26 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించింది. అయితే నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుని విషయంలో మాత్రం గందరగోళం నెలకొంది. నిర్మల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా ప్రభాకర్ రెడ్డి పేరు ఉంది. అయితే ఆ పేరు గల నేత జిల్లాలో లేకపోవడంతో కాంగ్రెస్‌లో అయోమయం నెలకొంది.
ఈ వ్యవహారంపై ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి స్పందించారు. ఏఐసీసీ విడుదల చేసిన జాబితాలో తప్పు దొర్లిందని.. నిర్మల్ డీసీసీ అధ్యక్షునిగా దొడ్డికింది ముత్యంరెడ్డి పేరు ఖరారు అయిందని చెప్పారు. ముత్యంరెడ్డి పేరుకు బదులు ప్రభాకర్ రెడ్డి పేరు వచ్చినట్లు తెలిపారు. తప్పుగా ప్రచురితమైన ప్రభాకర్ రెడ్డిని పేరును తొలగించి ముత్యంరెడ్డి పేరున్న జాబితాను ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
ఇక, కాంగ్రెస్ పార్టీ ఈ టీమ్‌తోనే వచ్చే ఏడాది జరగనున్న తెలంగాణ శాసన సభ ఎన్నికలకు వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. అయితే టీపీసీసీ కమిటీల్లో సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డికి మాత్రం కాంగ్రెస్ హైకమాండ్ చోటు కల్పించలేదు.
ఇక, టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా అజారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, మహేష్ గౌడ్, జగ్గారెడ్డిలను పార్టీ హైకమాండ్ అపాయింట్ చేసింది. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీకి టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఇందులో రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, వీ హనుమంతరావు(వీహెచ్), పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానా రెడ్డి, టీ జీవన్ రెడ్డి, గీతా రెడ్డి, షబ్బీర్ అలీ, దామోదర రాజనర్సింహ, రేణుకా చౌదరి, బలరామ్ నాయక్, మధుయాష్కి గౌడ్, చిన్నారెడ్డి, శ్రీధర్ బాబు, వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్‌లకు చోటు కల్పించారు. ఇక, పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి రేవంత్ రెడ్డి చైర్మన్‌గా వ్యవహరించనున్నారు.