తెలంగాణ అటవీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో నిర్మల్ బిజెపి నేత గణేష్ బిఆర్ఎస్ లో చేరారు.
నిర్మల్ : కర్ణాటక ఉపఎన్నికల్లో బిజెపి ఓటమి తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేసింది. పొరుగురాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందువరకు తెలంగాణలో బిజెపి మంచి జోష్ లో వుంది... కానీ రిజల్ట్ వ్యతిరేకంగా వచ్చేసరికి ఢీలా పడిపోయింది. ఇక రాష్ట్ర బిజెపి నాయకుల మధ్య ఆదిపత్య పోరు మరింత డ్యామేజ్ చేసింది.దీంతో ఇక బిజెపిలో వుండి లాభంలేదని అనుకుంటున్నారో ఏమోగాని కొందరు నాయకులు పార్టీ మారుతున్నారు. ఇలా తాజాగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నిర్మల్ మాజీ మున్సిపల్ ఛైర్మన్ అప్పాల గణేష్ బిఆర్ఎస్ చేరారు. అటవీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్వయంగా కండువాకప్పి గణేష్ ను పార్టీలో చేర్చుకున్నారు.
అప్పాల గణేష్ కమలం పార్టీని వీడి కారెక్కనున్న నేపథ్యంలో నిర్మల్ లో ఇవాళ సందడి నెలకొంది. తనవెంట బిఆర్ఎస్ పార్టీలో చేరే నాయకులు, తన అనుచరులతో కలిసి నిర్మల్ లోని బైల్ బజార్ నుండి దివ్యా గార్డెన్ వరకు గణేష్ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం దివ్యా గార్డెన్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. గణేష్ తో పాటు మున్పిపల్ కౌన్సిలర్లు కత్తి నరేందర్, శ్రీధర్, మాజీ కౌన్సిలర్లు రవి, నర్సయ్య, గోపి, అరుణుకుమార్, అప్పాల ప్రభాకర్ తదితరులు బిఆర్ఎస్ లో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ది, సంక్షేమ పాలన అందిస్తున్నారని అన్నారు. తెలంగాణ దేశంలోని అన్నిరాష్ట్రాల కంటే వేగంగా ప్రగతిపథంలో దూసుకుపోతోందని అన్నారు. దీంతో బిఆర్ఎస్ పార్టీకి అనూహ్యం స్పందన వస్తుందన్నారు. ఇప్పటికే మహారాష్ట్, మధ్యప్రదేశ్ తో పాటు పొరుగున వున్న ఏపీలో కూడా బిఆర్ఎస్ లో చేరికలు జరుగుతున్నాయని అన్నారు.
ఇక స్వరాష్ట్రంలో నిర్మల్ జిల్లా అభివృద్ది పథంలో దూసుకుపోతోందని మంత్రి అన్నారు. ఇప్పటికే నిర్మల్ పట్టణంలో బిఆర్ఎస్ బలోపేతంగా వుండగా గణేష్ రాకతో అది మరింత పెరిగిందన్నారు. ఇకపై సమిష్టిగా పనిచేసి నిర్మల్ ను మరింత అభివృద్ది చేసుకుందామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
