Niranjan Reddy: తన ఆస్తుల విషయంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు చేసిన ఆరోపణలను మంత్రి నిరంజన్‌ రెడ్డి (Niranjan reddy) తీవ్రంగా ఖండించారు. తనపై చేసిన ఆరోపణాలన్ని నిరాధరమైనవని అన్నారు. ఒక ఆరోపణ రుజువు చేసిన తన మంత్రి పదవికి రాజీమానా చేస్తానని సవాల్ విసిరారు.  

Niranjan Reddy: తన ఆస్తుల విషయంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు (Raghunandanrao) చేసిన ఆరోపణలను మంత్రి నిరంజన్‌ రెడ్డి (Niranjan reddy) తిప్పికొట్టారు. తనపై చేసిన ఆరోపణాలన్ని నిరాధరమైనవని ఖండించారు. అసలు ఆర్డీఎస్‌ కాలువ (RDS Cannal) ఎక్కడుందో తెలుసా అని ఎమ్మెల్యే రఘునందన్‌ రావును ప్రశ్నించారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే రఘునందన్‌ చూపిన పత్రాలు శుద్ధ అబద్ధాలని అన్నారు. 

తన 39 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు ప్రజల జీవితాల మెరుగు కోసమే ప్రయత్నించనని అన్నారు. ఊహాజనితంగా, ఆధారరహితంగా ఎన్నడూ మాట్లాడలేదని అన్నారు. రఘునందన్ రావు ఉద్యమంలో తనతో కలిసి పనిచేసాడనీ, కానీ.. రఘునందన్ రావు తన మనసులో ఇంత కుట్ర పెట్టుకున్నాడో తెలియదని అన్నారు. ఆయన నన్నే ఎందుకు టార్గెట్ చేసి.. మాట్లాడుతున్నారో తనకు తెలియదని అన్నారు. తన రాజకీయ జీవితం తన జిల్లా ప్రజల ముందు ఉందనీ, ప్రజలకు వాస్తవ విషయాలు తెలియాలని తను ఈ విషయంలో స్పందించాల్సి వస్తున్నదని అన్నారు. 

ఎవరో ఇచ్చిన కాగితాలు చేతిలో పెట్టుకున్న రఘునందన్ ..అవే బ్రహ్మంగారి కాలజ్ఞానం మాదిరిగా, అదే సర్వస్వంగా మాట్లాడారని ఆరోపించారు. అసలు ఆర్డీఎస్ ఎక్కడుందో? కృష్ణా నది ముంపు ఎక్కడుందో ? అవగాహన లేకుండా రఘునందన్ రావు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రఘునందన్ చెప్పిన చండూరు భూములకు ఆర్డీఎస్ కాలువ రాదనీ, సర్వే నంబర్ 60 లోని భూమి తన ఆధ్వర్యంలో ఉందని రఘునందన్ చెప్పిన మాట పూర్తిగా అవాస్తవమని అన్నారు. ఆయన చెప్పిన 17 ఎకరాల భూమిలో ముంపు కింద 12 ఎకరాలు పోగా మిగిలిన 5 ఎకరాలు మాత్రమే ఉంటుందనీ, దానిని న్యాయంగా కొనుగోలు చేశానని అన్నారు. 80 ఎకరాలు కోనుగోలు చేశాననీ, కానీ కబ్జా చేసినట్టు ఆరోపిస్తున్నారని అన్నారు. 

అలాగే.. ఆ భూమి చుట్టు మొత్తం కాంపౌండ్ కట్టారని ఆరోపించారనీ, కానీ.. కొంత గోడ, మిగతాది ఫెన్సింగ్ ఉన్నదని తెలిపారు. సర్వే నంబర్ 60లో ఉన్నది శ్రీశైలం ముంపు భూములు ఆర్డీఎస్ కాదని, అవసరమైతే..ఆ భూమిని సర్వే చేయించుకోవచ్చనీ, ఆ ఖర్చులు తానే భరిస్తానని అన్నారు. తన సవాల్ కు ఎప్పుడు వస్తారో రఘునందన్ రావు చెప్పాలనీ, మీ ఆరోపణలు దురుద్దేశపూర్వకం కాకపోతే వెంటనే స్పందించాలని అన్నారు. రఘునందర్‌ రావు ఆరోపణలు తప్పని రుజువైతే ఆయన ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

తమ కుటుంబానికి ఉన్న మొత్తం భూమి 90 ఎకరాలు మాత్రమేనని చెప్పారు. అలాగే తన తన వ్యవసాయ భూమిలో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు లేవని మంత్రి అన్నారు. కేవలం కూలీలు, బర్లు, ఆవులు, గొర్లు, ట్రాక్టర్ షెడ్లు మాత్రమే ఉన్నాయని తెలిపారు.మంత్రి పదవి రాకముందు నుంచే తనకున్న ఆస్తులు ఉన్నవేనని స్పష్టం చేశారు. అలాగే.. తన ఇల్లు రఘునందన్‌కు ఇచ్చి.. ఆయన ఇల్లు తీసుకునేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తనపై చేసిన ఒక్క ఆరోపణ నిరూపించినా తక్షణమే రాజీనామా చేస్తానని, సంచలనాల కోసం మాట్లాడే తత్వం తనది కాదని మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు.