Asianet News TeluguAsianet News Telugu

నేరెళ్ల బాధితులకు ఇలా ట్రీట్ మెంట్ చేసినం

  • నిమ్స్ మీద అసత్య ప్రచారం తగదు
  • నేరెళ్ల బాధితుల ఆరోగ్యం బాగుందంటేనే డిచ్ఛార్జి చేసినం
  • అన్ని పరీక్షలు చేసి నిర్ధారించినం
nims superintendant statement about nerella dalit patients treatment

ఓ ఆరుగురు పేషంట్ల ట్రీట్‌మెంట్ విష‌యంలో ఈ మధ్య కొంద‌రు నేత‌లు నిమ్స్ హాస్పిట‌ల్ మీద‌ నిందారోప‌ణ‌లు చేశారు. వారి ఆరోప‌ణ‌ల‌కు వివ‌ర‌ణ ఇవ్వాల‌ని భావిస్తున్నాను. అందులో భాగంగా టైమ్ టు టైమ్ ఏం జ‌రిగింద‌నేది వివరిస్తూ నిమ్స్ సూపరింటెండెంట్ సత్యనారాయణ వివరణ ఇచ్చారు. ఆ నోట్ లోని అంశాలను ఉన్నది ఉన్నట్లే ఇస్తున్నాం. చదవండి.

తేదీః06-09-2017న‌

మ‌ధ్యాహ్నం 2.00 గంట‌ల ప్రాంతంలో పి బ‌న్న‌య్య, గోపాల్‌, ఈశ్వ‌ర్ కుమార్‌, బాల‌రాజు, కె.ఎల్‌. హ‌రీశ్‌, మ‌హేశ్ అనే ఆరుగురు వ్య‌క్తులు త‌మ‌కు అనారోగ్యంగా ఉందంటూ టిపిసిసి నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, మాజీ ఎంపి వి.హ‌నుమంత‌రావుతో క‌లిసి నిమ్స్‌లోని రూమ్ నంబ‌ర్ 8లో మెడిక‌ల్ సూప‌రింటెండెంట్‌ని క‌లిసి ఆయా వ్య‌క్తుల ఆరోగ్య విష‌య‌మై చ‌ర్చించారు.

మ‌ధ్యాహ్నం 2.20 గంట‌ల ప్రాంతంలో op సమయం దాటినప్పటికి ఆర్ఎంఓ డాక్ట‌ర్ కిర‌ణ్‌, డాక్ట‌ర్ శ్రీ‌కాంత్‌, డాక్ట‌ర్ స‌తీశ్‌లు మాజీ మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబుతో క‌లిసి ఆ ఆరుగురిని ఎమ‌ర్జెన్సీ కి తీసుకెళ్ళారు.

మ‌ధ్యాహ్నం 2.40 గంట‌ల ప్రాంతంలో డ్యూటీ చీఫ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ దీప్తి, త్ర‌నుమ్‌లు ఆ ఆరుగురు వ్య‌క్తుల కేస్ హిస్ట‌రీ తీసుకుని, ఎమ‌ర్జెన్సీ మెడిసిన్ హెడ్ డాక్ట‌ర్ ఆశిమా శ‌ర్మ ఇఎండి డ్యూటీ ఫ్యాక‌ల్టీ విశ్వ‌, రెసిడెంట్ రోహ‌న్‌లు కూడా ఆ ఆరుగురు వ్య‌క్తుల‌ను ప‌రీక్షించారు. ప్రాథ‌మిక చికిత్స చేసి, ప్రాథ‌మిక ప‌రీక్ష‌లు రాశారు. అలాగే, ఆర్థోపెడిక్‌, యూరాల‌జీ రెసిడెంట్‌కి రెఫ‌ర్ చేశారు.

మ‌ధ్యాహ్నం 3.00 గంట‌ల ప్రాంతంలో ఆ ఆరుగురు పేషంట్ల‌ని ఆర్థో యూనిట్ 3 రెసిడెంట్ డాక్ట‌ర్ ప్ర‌వీణ్ ప‌రీక్షించి, ఎక్స్ రే, అల్ట్రా సోనోగ్ర‌ఫీ స్కాన్ రాశారు.

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల ప్రాంతంలో ఆ ఆరుగురు పేషంట్ల‌ని ట్రామా రూమ్ నెంబ‌ర్ 104లోకి మార్చారు. అందులో ఆరు బెడ్లు ఉండ‌గా, ఆరుగురుని అందులోకి షిఫ్ట్ చేశారు.

సాయంత్రం 6.15 గంట‌ల ప్రాంతంలో ఆన్ డ్యూటీ యూరాల‌జీ రెసిడెంట్ డాక్ట‌ర్ దుర్గా ప్ర‌సాద్ 104రూమ్‌లోని ఆ ఆరుగురు పేషంట్ల‌ని ప‌రీక్షించి, ఈశ్వ‌ర్ కుమార్ అనే పేషంట్ మూత్ర సంబంధ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నాన‌ని చెప్ప‌గా, యూరిన్ క‌ల్చ‌ర్, మ‌రోసారి అల్ట్రా సోనోగ్ర‌ఫీ స్కాన్‌లు రాశారు.

రాత్రి. 8.15 గంట‌ల ప్రాంతంలో 104వ రూమ్‌లోకి ఆన్ డ్యూటీ న‌ర్స్ వెళ్ళి ఎక్స్ రే, అల్ట్రాసోనోగ్ర‌ఫీ స్కాన్స్ కోసం రావాల్సిందిగా చెప్ప‌గా, ఆ స‌మ‌యంలో ఆ ఆరుగురు పేషంట్లు రాత్రి భోజ‌నం చేస్తున్నారు.

రాత్రి. 9.00 గంట‌ల ప్రాంతంలో ఎమ‌ర్జెన్సీ మెడిసిన్ ఆన్ డ్యూటీ డాక్ట‌ర్ రాఘ‌వేంద్ర ఆ ఆరుగురిని ప‌రీక్షించ‌గా, వాళ్ళంతా ఆరోగ్యంగానే ఉన్న‌ట్లుగా తేలింది.

రాత్రి. 10.00 గంట‌ల ప్రాంతంలో ఆ ఆరుగురు పేషంట్ల‌కి ఎక్స్ రే, అల్ట్రా సోనోగ్ర‌ఫీ స్కాన్‌లు చేశారు.

రాత్రి. 10.40 గంట‌ల ప్రాంతంలో డ్యూటీ రెసిడెంట్ డాక్ట‌ర్ మాళ‌విక వెళ్ళి చూసి, వారికి సంబంధించిన అన్ని ప‌రీక్ష‌లు నిర్వ‌హించార‌ని నిర్ధారించుకున్నారు. వాటిని ప‌రిశీలించారు.

తేదీః 07-09-2017న

ఉద‌యం.6.30 గంట‌ల ప్రాంతంలో ఎమ‌ర్జెన్సీ మెడిసిన్ విభాగం డ్యూటీ డాక్ట‌ర్ రాఘ‌వేంద్ర ఆ ఆరుగురి పేషంట్ల‌ను, వారి రిపోర్టుల‌ను ప‌రిశీలించి వారు ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని చెప్పారు.

ఉద‌యం. 7.50 గంట‌ల ప్రాంతంలో చీఫ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ డాక్ట‌ర్ వెంక‌ట‌రావు ఆ ఆరుగురి రిపోర్టులు చూసి, వాళ్ళంతా బాగానే ఉన్నార‌ని వారికి చెప్పారు.

ఉద‌యం. 9.00 గంట‌ల ప్రాంతంలో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్ ల‌క్ష్మీభాస్క‌ర్ మాళ‌విక‌తో క‌లిసి వెళ్ళి వారికి పెద్ద‌గా ఇబ్బందీ ప‌డాల్సిన స‌మ‌స్య‌లేవీ లేవ‌ని, త‌గు వైద్యం అందిస్తామ‌ని చెప్పారు.

త‌ద‌నంత‌రం ఆ ఆరుగురు పేషంట్ల రిపోర్టులు ప‌రిశీలించిన‌, వారిని ప‌రీక్షించిన డాక్ట‌ర్లంతా ఎమ‌ర్జెన్సీ విభాగంలో ఉండాల్సింత ఇబ్బందుల్లో లేర‌ని, వారు ఓపీ విభాగం ద్వారా వ‌చ్చి ప‌రీక్ష‌లు జ‌రుపుకోవ‌చ్చ‌ని నిర్ధారించారు.
అయితే, ఆ ఆరుగురు పేషంట్లు సాయంత్రం వ‌ర‌కు నిమ్స్ ద‌వాఖానాలోనే ఉన్నారు. కొంద‌రు రాజ‌కీయ నేత‌లు అక్క‌డ‌కు వ‌చ్చిన కొద్దిసేప‌ట్లోనే వాళ్ళ‌తో క‌లిసి నిమ్స్ ఎదుట ధ‌ర్నాలో పాల్గొన్నారు. సంబంధిత డాక్టర్లు వెళ్లి బతిమిలాడినా కనీసం స‌మాచారం కూడా ఇవ్వ‌కుండా పేషంట్ల‌ను తీసుకెళ్లారు.

ఇదీ జ‌రిగింది. అయితే, కొంద‌రు ప‌ని గ‌ట్టుకుని వైద్యానికి సంబంధంలేని ప‌రిభాష‌లో నిమ్స్‌ని నిందించ‌డం శోచ‌నీయం. ఏ పేషంట్ల ట్రీట్‌మెంట్ విష‌యంలోనూ నిమ్స్ డాక్ట‌ర్లు, సిబ్బంది ఏమాత్రం నిర్ల‌క్ష్యం వ‌హిచడంలేదు. ఆ ఆరుగురి విష‌యంలోనూ నిర్ల‌క్ష్యం జ‌ర‌గ‌లేదు. ట్రీట్‌మెంట్ ఇవ్వ‌మ‌ని ఎవ్వ‌రూ అన‌లేదు. అలా అయితే రెండు రోజుల‌పాటు ఆ ఆరుగురు పేషంట్లు 104 రూమ్‌లోనే ఎందుకు ఎలా ఉన్న‌ట్లు? ప‌రీక్ష‌లు, ఎక్స్ రేలు, స్కాన్‌లు కూడా జ‌రిగాయి. త‌గు సూచ‌న‌లు ఇవ్వ‌డం జ‌రిగింది. మ‌రోవైపు రోటీన్ ట్రీట్‌మెంట్‌తో సంబంధంలేని ప్ర‌ముఖుల‌ను కూడా లాగి మాట్లాడటం ప్ర‌ముఖ ప‌ద‌వులు నిర్వ‌ర్తించిన‌ నేత‌ల‌కు త‌గ‌ద‌ని మ‌న‌వి. ప్రాణాలు కాపాడే ప‌విత్ర వైద్యానికి త‌మ త‌మ ఆస‌క్తుల‌తో నింద‌రోప‌ణ‌లు ఒడిగ‌ట్ట వ‌ద్ద‌ని అంద‌రినీ వేడుకుంటున్నాం.

 

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

Follow Us:
Download App:
  • android
  • ios