హైదరాబాద్: నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరిన ఓ వికలాంగుడిని న్యూరో విభాగానికి చెందిన సిబ్బంది మోసం చేశారు. రోగి నుండి రూ. 45 వేలు వసూలు చేశారు. శస్త్రచికిత్స చేయకున్నా చేసినట్టుగా డిశ్చార్జ్ చేసినట్టుగా రిపోర్టు రాశారని బాధితుడు ఆరోపించారు.న్యూరో విభాగానికి  వైద్యం కోసం  ఓ వెంకటేష్ వచ్చాడు.  అయితే మూడు మాసాలపాటు తిప్పారన్నారు. ఈ నెల 5వ తేదీన తనను నిమ్స్ న్యూరో విభాగంలో అడ్మిట్ చేసుకొన్నారన్నారు.

అయితే తనకు శస్త్రచికిత్స చేసేందుకు బయట నుండి డాక్టర్ ను పిలిపించాలని దీనికి ఖర్చు అవుతోందని తనకు చెప్పారని ఆయన వివరించారు. అయితే తనకు ఆరోగ్యశ్రీ వర్తిస్తోందని చెప్పినా కూడ వినకుండా తన నుండి  డబ్బులు వసూలు చేశారని ఆయన తెలిపారు.తన వద్ద నుండి వసూలు చేసిన రూ. 45 వేలకు రశీదు కూడ ఇచ్చారన్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ ఫీజు కట్టించారని ఆయన మీడియాకు చెప్పారు.

ప్రైవేట్ డాక్టర్ ఆపరేషన్ చేసేందుకు తప్పనిసరిగా రప్పించాల్సిందేనని పట్టుబట్టారని ఆయన చెప్పారు.అయితే డాక్టర్ ఆపరేషన్ చేసేందుకు రాకపోవడంతో  తనకు ఆపరేషన్ చేసినట్టుగా డిశ్చార్జ్ షీట్ లో రాశారని ఆయన చెప్పారు. ఈ విషయమై తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితుడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు