Asianet News TeluguAsianet News Telugu

రాధ మిస్సింగ్ కేసు.. హైకోర్టు అడ్వకేట్ శిల్ప ఇంట్లో ఎన్ఐఏ సోదాలు

హైదరాబాద్‌ ఉప్పల్ చిలుకానగర్‌లో National Investigation Agency సోదాలు చేపట్టింది. హైకోర్టు అడ్వకేట్ శిల్ప ఇంట్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నర్సింగ్ విద్యార్థి రాధ మిస్సింగ్‌ కేసులో భాగంగా ఆమె ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు.

NIA Searches High Court Advocate shilpa House
Author
First Published Jun 23, 2022, 10:07 AM IST

హైదరాబాద్‌ ఉప్పల్ చిలుకానగర్‌లో National Investigation Agency సోదాలు చేపట్టింది. హైకోర్టు అడ్వకేట్ శిల్ప ఇంట్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నర్సింగ్ విద్యార్థి రాధ మిస్సింగ్‌ కేసులో భాగంగా ఆమె ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం విశాఖపట్నంలో రాధ అదృశ్యమైంది. రాధను మావోయిస్టు అనుబంధ సంస్థ చైతన్య మహిళ సంఘం నాయకులు కిడ్నాప్ చేశారని ఆమె తల్లి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విశాఖపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ ఏడాది మే 31వ తేదీన కేసు రీ-ఓపెన్ చేసి దర్యాప్తు చేయాలని NIA కు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇటీవల ఈ కేసును ఎన్‌ఐఏ టేకప్ చేసింది.  అయితే రాధను నక్సల్స్‌లో చేర్చారని అడ్వకేట్‌ శిల్పతో పాటు మరికొందరిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే NIA ఏకకాలంలో మూడు చోట్ల సోదాలు నిర్వహిస్తోంది.

అసలేం జరిగిందంటే.. 
రాధ అనే నర్సింగ్ విద్యార్ధిని గత మూడున్నరేళ్లుగా కనిపించకుండా పోయింది. రాధ కనిపించకుండా పోవడంపై విశాఖపట్నం పోలీసులు మావోయిస్టులపై తొలుత ఎఫ్ఐఆర్ నమోదు చేయగా.. ఇప్పుడు దానిని ఎన్ఐఏ టేకప్ చేసింది. కిడ్నాప్, అక్రమ నిర్బంధం, చట్టవిరుద్ధంగా సమావేశం, అల్లర్లు, నేరపూరిత కుట్ర, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది.

హైదరాబాద్‌లోని కాప్రాలోని సాయిబాబా కాలనీకి చెందిన పల్లెపాటి పోచమ్మ తన ఫిర్యాదులో.. ‘‘నా చిన్న కూతురు రాధ నర్సింగ్ కోర్స్ చేస్తుండగా.. చైతన్య మహిళా సంఘం (CMS) నాయకులు దేవేంద్ర, స్వప్న, చుక్క శిల్ప తదితరులు నా కూతురు కాలేజీకి వస్తుండడంతో మావోయిజం భావజాలం ఆమె మనసులోకి ఎక్కింది. 2017 డిసెంబర్‌లో ఎవరికో వైద్యం అందించాలనే నెపంతో దేవేంద్ర రాధను బలవంతంగా తీసుకెళ్లాడు. అప్పటి నుంచి ఆమె ఇంటికి తిరిగి రాలేదు. తొమ్మిది నెలల తర్వాత విశాఖపట్నం జిల్లా పెద్దబయలు అటవీ ప్రాంతంలో మావోయిస్ట్‌ అగ్రనేతలు ఉదయ్‌, అరుణతో కలిసి నా కూతురు అక్రమంగా మావోయిస్టు పార్టీలో చేరి పని చేస్తోందని తెలిసింది’’ అని పేర్కొన్నారు. 

‘‘సీఎంఎస్ నాయకులు కుట్ర పన్నారు, చట్టవిరుద్ధంగా సమావేశాలు నిర్వహించారు. రాధను మావోయిస్టు ర్యాంక్‌లో చేర్చుకున్నారు. దేవేంద్ర రాధను కిడ్నాప్ చేసి.. మావోయిస్టుల ఉన్నతాధికారులతో కలిసి పని చేయడానికి ఆమెను అటవీ ప్రాంతాలలో తీసుకెళ్లి  నిర్బంధించారు’’ అని జూన్ 3న జారీ చేసిన ఎఫ్‌ఐఆర్‌లో NIA పేర్కొంది. మావోయిస్టు అగ్రనేతలు గాజర్ల రవి అలియాస్ ఉదయ్, ఆంధ్రా ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి అరుణ, అలాగే దేవేంద్ర, స్వప్న, శిల్పలను ఈ కేసులో కీలక నిందితులుగా ఎన్ఐఏ హైదరాబాద్ పేర్కొంది. 

అంతకు ముందు ఈ ఏడాది జనవరిలో విశాఖలోని Peddabayulu పోలీసులు ప్రాథమిక ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. పోలీసు ఎఫ్‌ఐఆర్‌లో.. ‘‘ సీఎంఎస్ సభ్యులు కళాశాలలు, పాఠశాలలు, హాస్టళ్లను సందర్శించి పేద మహిళలకు సాధికారతపై ఉపన్యాసాలు ఇస్తున్నారని, వారికి ఉపాధి కల్పిస్తామని మావోయిస్టు పార్టీలో చేరేలా ప్రేరేపిస్తారని’’ అని ఆరోపించారు. అయితే ఈ కేసును పెద్దబయలు పోలీసుల నుంచి టెకోవర్ చేయాలని మే 31న హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios