హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలపై జాతీయ మానవ హక్కుల సంఘం సీరియస్ అయ్యింది. ఇంటర్ పరీక్ష ఫలితాలు, విద్యార్థుల బలవన్మరణాలపై 4 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కోరుతూ తెలంగాణ సీఎస్‌ శైలేంద్రకుమార్‌ జోషికి నోటీసులు జారీ చేసింది. 

ఆత్మహత్యలకు కారణమైనవారిపై చర్యలు తీసుకొని 4 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని మానవహక్కుల కమిషన్ ఆదేశించింది. బాధిత కుటుంబాలకు తగిన ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవాలని, మీడియా లేవనెత్తిన అంశాలు నిజమైతే పొరపాట్లకు కారణమైన అధికారులు మానవహక్కులను ఉల్లంఘించినట్లేనని స్పష్టం చేసింది. 

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించింది. బాధ్యులను శిక్షించడమే కాదని, ఇది తలదించుకోవాల్సిన ఘటనని ఎన్‌హెచ్‌ఆర్సీ అభిప్రాయపడింది.  ఏప్రిల్ 18న తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియట్‌ ఫలితాలను విడుదల చేసింది. 

విద్యార్థులకు ఆశించిన మార్కులు రాకపోవటం, కొందరు విద్యార్థులకు మార్కులే వేయకపోవటంతో ఫలితాలపై గందరగోళం నెలకొంది. ఇంకొందరు విద్యార్థులు పాస్ కాకపోవడంతో ఆత్మనూన్యతా భావంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

తెలంగాణ వ్యాప్తంగా 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలుస్తోంది. ఇంటర్‌ బోర్డు తప్పిదాలకు విద్యార్థులు బలికావటమే కాక తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు బయటకు చెప్పుకోలేక మదన పడతున్నారు. 

విద్యార్థులు, తల్లిదండ్రులు ఫలితాలపై అనుమానం వ్యక్తం చేస్తూ హైదరాబాద్‌లో ఇంటర్‌ బోర్డు ముందు నిరసన చేపట్టారు. ఇంటర్మీడియేట్ బోర్డు బాధ్యత వహించాలని డిమాండ్లు రావడంతో చివరకు తెలంగాణ ప్రభుత్వం స్పందించి రీ వాల్యువేషన్, రీ కౌంటింగ్ ఉచితంగా నిర్వహిస్తామని ప్రకటించింది. 

ఇంటర్‌ ఫలితాల అనంతరం జరుగుతున్న విద్యార్థుల బలవన్మరణాలు, ఆత్మహత్యాయత్నాలు గురువారం కూడా కొనసాగాయి. నారాయణపేట జిల్లా ఉట్కూర్‌ మండలానికి చెందిన గాయత్రి అనే ఇంటర్‌ విద్యార్థిని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. 

గాయత్రి స్థానిక ప్రభుత్వ కళాశాలలో ఇంటర్‌ చదువుతోంది. అయితే ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఫెయిల్‌ అయినట్టు రావడంతో ఈ నెల 19న ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మాహత్యాయత్నానికి ప్రయత్నించింది. తీవ్రగాయాలపాలైన ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్సపొందుతూ బుధవారం రాత్రి మృతిచెందింది.