హైదరాబాద్: దిశ రేప్, హత్య కేసు నిందితుల ఎన్ కౌంటర్ సంఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ఆర్సీ) నిజనిర్ధారణ కమిటీ సభ్యులు విచారణ చేపట్టారు. నలుగురు సభ్యుల బృందం ఢిల్లీ నుంచి శనివారం హైదరాబాదుకు చేరుకుంది. 

నిందితుల మృతదేహాలను భద్రపరిచిన మహబూబ్ నగర్ ఆస్పత్రిని సభ్యులు సందర్శించారు. మృతుల తల్లిదండ్రులు, వారి తరఫు వైద్యుల సమక్షంలో పరిశీలించారు. మృతుల తల్లిదండ్రుల వాంగ్మూలాలను రికార్డు చేశారు. 

మృతదేహాలపై ఉన్న బుల్లెట్ గాయాలను వారు పరిశీలించారు. పోస్టుమార్టం నివేదికలను ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించారు. ఆ తర్వాత చటాన్ పల్లిలోని ఎన్ కౌంటర్ జరిగిన స్థలానికి చేరుకున్నారు. సంఘటనా స్థలాన్ని వారు పరిశీలించారు. మృతుల శవాల తరలింపుపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఈ నెల 9వ తేదీ వరకు కూడా ఆస్పత్రిలోనే ఉండే అవకాశం ఉంది.

చాటన్ పల్లి ఘటనా స్థలాన్ని ఎన్ హెచ్ఆర్సీ సభ్యులు రేపు గానీ ఎల్లుండి గానీ పరిశీలించే అవకాశం ఉంది. దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ మీద ఎన్ హెచ్ఆర్సీ స్పందించిన విషయం తెలిసిందే. ఎన్ కౌంటర్ పై తమకు సందేహాలున్నాయని, వాటిని నివృత్తి చేసుకునేంత వరకు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించరాదంటూ జిల్లా పోలీసులను ఆదేశించింది. దీంతో నిందితుల మృతదేహాలను మహబూబ్ నగర్ జిల్లా ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు.