తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచనలు చేసింది. దక్షిణ, మధ్య బంగాళాఖాతంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో రెండు రోజుల పాటు గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు.

అలాగే సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్య్సకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. దీని కారణంగా రాబోయే ఐదు రోజుల పాటు తెలంగాణ, కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు.

రాయలసీమలోనూ అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని.. ఉభయ రాష్ట్రాల్లోనూ కొన్ని చోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడతాయని అధికారులు వెల్లడించారు. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని తెలిపారు.

తెలంగాణ ఇప్పటి వరకు సాధారణం కన్నా 54 శాతం ఎక్కువగా వర్షాలు కురిశాయని ఐఎండీ తెలిపింది. కాగా, మంగళవారం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురిశాయి.