ఒంటరిగా ఎవరికీ కనిపించకుండా పార్కుల వెంట, చెట్ల వెంట తిరిగే ప్రేమ జంటలను టార్గెట్ చేసుకొని.. వారిని రహస్యంగా వీడియోలు తీసి.. వాళ్లని బ్లాక్ మెయిల్ చేసి డబ్బు సంపాదిస్తున్నాడు ఓ వ్యక్తి. చివరకు పోలీసులకు చిక్కి.. జైల్లో ఊచలు లెక్కపెట్టుకుంటున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే...  సూర్యాపేట జిల్లా, దురాస్ పల్లి మండలం, వాస్రమ్‌ తండాకు చెందిన బానోత్‌ చంద్రు కుమారుడు బానోత్‌ ప్రవీణ్‌కుమార్‌(24) మూసాపేటలో నివాసం ఉంటున్నాడు. గతంలో బేగంపేటలోని ఓ ప్రైవేటు  కంపెనీలో పనిచేశాడు. తర్వాత ఓ చానల్‌కు పార్ట్‌టైమ్‌ క్రైమ్‌రిపోర్టర్‌గా ఎంపికయ్యాడు.  వచ్చే జీతం సరిపోకపోవడంతో..  డబ్బు సంపాదించేందుకు ప్రేమ జంటలను ఎంచుకున్నాడు. 
నిర్మానుష్య ప్రదేశాల్లో ప్రేమ వ్యవహారం నడిపే జంటలను, వివాహేతర సంబంధాలు నెరిపేవారిని టార్గెట్‌ చేసి వీడియోలు తీసే వాడు. వాటితో బెదిరించి డబ్బు వసూలు చేసేవాడు.
 
గత ఏడాది డిసెంబర్‌ 29న మధ్యాహ్నం మేడిపల్లికి చెందిన ఓ వ్యక్తి తన స్నేహితురాలితో కలిసి కారులో మేడిపల్లి నుంచి పర్వాతాపూర్‌ వెళ్లే దారిలోని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లాడు. ఇది గమనించిన ప్రవీణ్‌కుమార్‌ వారిని వెంబడించి వీడియో తీశాడు. తాను పోలీసునని, అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే వీడియోలను బయటపెట్టి మీ పరువును బజారుకీడుస్తా నంటూ బెదిరించాడు. దీంతో సదరు వ్యక్తి తనవద్ద ఉన్న రూ.2 లక్ష లను, 4బంగారు ఉంగరాలను, ఒక బంగారు చైన్‌ను అతనికి ఇచ్చి బయటపడ్డారు. 

తర్వాత మళ్లీ డబ్బు అవసరం పడటంతో.. ఆ వీడియో చూపించి వాళ్లను బెదిరించడం మొదలుపెట్టాడు. దీంతో.. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో.. బండారం బయటపడింది. అతనిని పోలీసులు అరెస్టు చేశారు.