తెలంగాణలో మందుబాబులకు న్యూ ఇయర్ సందర్భంగా బంపర్ ఆఫర్ ప్రకటించారు. డిసెంబర్ 31వ తేదీన రాత్రి అదనంగా మరో గంటపాటు మద్యం దుకాణాలు తెరిచి ఉండనున్నాయి. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్  ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలోని మద్యం దుకాణాలు ఉదయం10 నుంచి రాత్రి గంటలకు వరకు, జిల్లాల్లో ఉదయం 10 నుంచి రాత్రి 10గంటల వరకు అనుమతి ఉంది. కాగా.. తాజా ఉత్తర్వుల మేరకు ఈ నెల 31వ తేదీన మద్యం దుకాణాలు మరో గంట అదనంగా పనిచేయనున్నాయి.

జీహెచ్‌ఎంసీ పరిధిలో అర్ధరాత్రి 12 గంటల వరకు, జిల్లాల్లో రాత్రి 11 గంటల వరకు మద్యం దుకాణాలకు అనుమతి ఉంటుంది. బార్లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, క్లబ్బులు, రిసార్టుల్లోని మద్యం విభాగాలు అర్ధరాత్రి ఒంటిగంట వరకు తెరిచి ఉంటాయి. కొత్త సంవత్సరం సందర్భంగా ప్రత్యేక వేడుకలు నిర్వహించే వారు పర్మిషన్‌ తీసుకోవాలని ఎక్సైజ్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సభర్వాల్‌ వేరే ప్రకటనలో తెలిపారు. ఇందుకు జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.9వేలు, జిల్లాల్లో రూ.6వేల ఫీజు ఉంటుందని పేర్కొన్నారు.