తెలంగాణలో టీఆర్ఎస్ పేరుతో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ పేరుకు ప్రజల్లో వున్న క్రేజ్‌ను , పాపులారిటీని వాడుకునేందుకు కొందరు టీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీ పెడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి

తెలంగాణలో టీఆర్ఎస్ పేరుతో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) , తెలంగాణ రైతు సమితి (టీఆర్ఎస్) పేరుతో రిజిస్ట్రేషన్ కోసం కొందరు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవలే తెలంగాణ రాష్ట్ర సమితి .. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మారిన నేపథ్యంలో టీఆర్ఎస్ పేరుకు ప్రజల్లో వున్న క్రేజ్‌ను , పాపులారిటీని వాడుకునేందుకు కొందరు టీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీ పెడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే దీని వెనుక ఎవరున్నారు అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. 

కాగా.. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ గత ఏడాది అక్టోబర్ 5న తీర్మానం చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. ఈ తీర్మానాన్ని పరిశీలించిన ఈసీ టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ కేసీఆర్ కు డిసెంబర్ 8వ తేదీన సమాచారం పంపింది. ఈసీ పంపిన లేఖను అంగీకరిస్తూ కేసీఆర్ సంతకం చేశారు. టిఆర్ఎస్ బీఆర్ఎస్ గా ఆవిర్భవించిన తర్వాతి నుంచి పార్టీని వివిధ రాష్ట్రాల్లో విస్తరించే దిశగా అధిష్టానం ఆంధ్రప్రదేశ్ సహా అనేక రాష్ట్రాల నాయకులతో చర్చలు జరుపుతుంది. ఇప్పటికే తెలంగాణ, మహారాష్ట్రాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించారు కేసీఆర్.