తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ హైకోర్టులో తాజాగా ఓ పిటిషన్ దాఖలయ్యింది. ఆయన గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈసీకి  తప్పుడు సమాచారం  అందించారని..అందువల్ల ఆతడికి ఎమ్మెల్యేగా కొనసాగే అర్హత లేదంటూ పిటిషనర్ పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టనుంది. 

సీఎం కేసీఆర్ గత రెండు పర్యాయాలుగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే తాజాగా తెలంగాణలో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో అందరు అభ్యర్ధుల మాదిరిగానే కేసీఆర్ కూడా నామినేషన్ పత్రాలతో పాటు వ్యక్తిగత సమాచారంలో కూడిన అపిడవిట్ దాఖలు చేశారు. ఇందులో కేసీఆర్ తన వక్తిగత వివరాలను దాచిపెట్టి తప్పుడు సమాచారాన్ని ఈసికి అందించారని గజ్వేల్ కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు.  

ప్రస్తుతం గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిచిన కేసీఆర్‌పై 64 క్రిమినల్ కేసులు వున్నాయని శ్రీనివాస్ తెలిపారు. అయితే కేసీఆర్ తన ఎన్నికల అపిడవిట్ లో మాత్రం 2 కేసులు మాత్రమే వున్నాయంటూ ఈసికి తప్పుడు సమాచారాన్ని అందించారన్నారు. ఇందుకుగాను అతన్ని ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని శ్రీనివాస్ తన పిటిషన్ లో పేర్కొన్నారు.