చెడుదారుల వైపు చూడకుండా.. విద్యార్థులు మంచి మార్గంలో నడిచేలా దిశా నిర్దేశం చేయాల్సిన బాధ్యత ప్రిన్సిపల్ పై ఉంటుంది.  అలాంటి హోదాలో ఉన్న ఓ ప్రిన్సిపల్ విద్యార్థుల భవిష్యత్తుపై డబ్బులు మూటగట్టుకోవాలని అనుకున్నాడు. మాస్ కాపీయింగ్ తో విద్యార్థులకు ఎరవేసి.. తాను డబ్బులు దండుకోవాలని ప్లాన్ వేశాడు. ఒక్కో పరీక్ష కు రూ.8వేలు కడితే చాలంటూ విద్యార్థులకు ఎరవేశాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని టోలీచౌకీ న్యూ మదీనా కాలేజీలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... నగరంలోని టోలిచౌకి సూర్యనగర్‌ కాలనీలో ఉన్న న్యూ మదీన జూనియర్‌ కాలేజీ కేంద్రంగా మాస్ కాపీయింగ్  జరుగుతోంది. ఆ కాలేజీ ప్రిన్సిపల్ తన్వర్ విద్యార్థులకు ఎరవేయడం గమనార్హం.  ఒక్కో సబ్జెక్టుకు రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు వసూలు చేస్తున్నాడు. ఆయా పరీక్షల ప్రశ్నపత్రాలు స్థానిక పోలీసుస్టేషన్లలో ఉంటాయి. 

Also Read కల్వర్టు కింద నగ్నంగా మహిళ శవం: అక్రమ సంబంధమే కారణమా?...

ఓఎంఆర్‌ షీట్‌తో కూడిన ఆన్సర్‌ షీట్స్‌ మాత్రం పరీక్ష కేంద్రానికే చేరతాయి. అక్కడ పరీక్ష రాసే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఇంటర్మీడియట్‌ బోర్డ్‌ వీటిని అందిస్తుంది. వీటిని బోర్డుకు చెందిన ఎగ్జామినర్‌ పర్యవేక్షణలో ఆయా సెంటర్లకు చెందిన వారు సిద్ధం చేస్తారు. దీన్నే తన్వీర్‌ అనుకూలంగా మార్చుకున్నాడు.

ప్రతి ప్రశ్నపత్రంతోనూ జతచేసి ఉండే ఆన్సర్‌షీట్స్‌ బుక్‌లెట్‌ను ముందు రోజు రాత్రే వీళ్లు మార్చేస్తున్నారు. ఓఎంఆర్‌ షీట్‌కు డమ్మీ జవాబుపత్రాన్ని జత చేస్తున్నారు. పరీక్ష రాసేటపుడు విద్యార్థి బుక్‌లెట్‌పై ఉండే ఓఎంఆర్‌ షీట్‌లో క్వశ్చన్‌ పేపర్‌తో పాటు ఈ బుక్‌లెట్‌ నంబర్‌ కూడా వేయాలి. మదీన జూనియర్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ తమతో ఒప్పందం కుదుర్చుకున్న వారికి ఓఎంఆర్‌ షీట్స్‌తో డమ్మీ బుక్‌లెట్స్‌ ఇస్తున్నాడు. 

అదే సమయంలో ప్రిన్సిపాల్‌.. అసలు బుక్‌లెట్స్‌ను కాలేజీ అడ్మినిస్ట్రేటివ్‌ సిబ్బంది సయ్యద్‌ కలీముద్దీన్, షబానా బేగం, జాహెదా షరీన్‌కు ఇచ్చి పుస్తకాల్లో చూసి రాయిస్తున్నాడు. ఆయా సబ్జెక్టుల ప్రశ్నపత్రాలూ వీరికి ఇస్తున్నాడు. పరీక్ష ముగిశాక ఈ అసలు బుక్‌లెట్స్‌ను ఒప్పం దం చేసుకున్న విద్యార్థులకు అందించి, వాటిని ఓఎంఆర్‌ షీట్‌ కు జతచేయిస్తూ దానిపై ఆ బుక్‌లెట్‌ నంబర్‌ వేయిస్తున్నాడు. 

గత కొద్ది రోజులుగా గుట్టుగా సాగుతోన్న మాస్‌ కాపీయింగ్‌ వ్యవహారాన్ని పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రట్టు చేశారు. బుధవారం కాలేజీపై దాడిచేసిన ప్రత్యేక బృందం.. కాలేజీ ప్రిన్సిపాల్, ముగ్గురు పరిపాలన విభాగం సిబ్బంది, ఆరుగురు విద్యార్థుల్ని పట్టుకుంది.