తెలంగాణ ప్రభుత్వం టీచర్ ఉద్యోగాల భర్తీ విషయంలో చేస్తున్న జాప్యంపై నిరుద్యోగులు రగలిపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయకపోవడంతో లక్షలాది మంది టీచర్ అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఒకవైపు బంగారు తెలంగాణ అని చెబుతున్న పాలకులు టీచర్ పోస్టుల భర్తీ విషయంలో మాట తప్పి మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సర్కారు వైఖరిని ఎండగట్టేందుకు నిరుద్యోగ టీచర్ అభ్యర్థులు ద్విముఖ వ్యూహంతో ముందుకుపోతున్నారు. అందులో ఒకటి సర్కారుపై వత్తిడి తెచ్చేందుకు ఆందోళనబాట పట్టారు. ఇప్పటికే టీచర్ అభ్యర్థులు మెగా డిఎస్సీ కోసం మహా పాదయాత్ర ప్రారంభమైంది. వరంగల్ నుంచి హైదరాబాద్ వరకు భారీ పాదయాత్రను చేపట్టారు నిరుద్యోగ జెఎసి నేతలు. (ఫొటో కింద చూడొచ్చు)

ఇక రెండోవైపు తమ ఆవేదనను, తమ ఆక్రందనను సోషల్ మీడియాలో వెల్లగక్కుతున్నారు నిరుద్యోగ టీచర్ అభ్యర్థులు. రోజుకో జోక్ ద్వారా తమ నిరసనను సమాజానికి తెలియజేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

తాజాగా ఈ జోక్ వైరల్ అవుతోంది. అదేమంటే.... ‘‘

ఉత్తర ప్రదేశ్ లో డీఎస్సి ని యూపీ డీఎస్సి అంటారు

మధ్య ప్రదేశ్ లో డీఎస్సి ని ఎంపీ డీఎస్సి అంటారు

ఆంధ్ర ప్రదేశ్ లో డీఎస్సి ని ఏపీ డీఎస్సి అంటారు

కానీ....తెలంగాణ లొ డీఎస్సిని త్వరలో డీఎస్సి అంటారు.

 

ఇదే కాకుండా సిఎం కేసిఆర్ పైనా జోక్ లు పేలుతున్నాయి. సిఎం కేసిఆర్ కంటి ఆపరేషన్ నేపథ్యంలో ఆయనకు కంటి ఆపరేషన్ సక్సెస్ కావాలని తాము కోరుకుంటున్నామని టీచర్ అభ్యర్థులు పోస్టు చేశారు. ఎందుకంటే ఇంతకాలం తమ ఆవేదన సిఎం కు కనిపించలేదని, కంటి ఆపరేషన్ తర్వాత తమ బాధలు చూసి చలించి పోయి ఆయన టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తారు అంటూ మరో సెటైర్ కూడా నిరుద్యోగులు సర్కులేషన్ లో ఉంచారు.

 

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి