హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి ఎవరనే విషయం మరికొద్ది గంటల్లో తేలనుంది. అయితే కొత్త ముఖ్యమంత్రి ఈ నెల 12వ తేదీన ప్రమాణం చేసే ఛాన్స్ ఉంది. ఆ రోజు మంచి ముహుర్తం ఉన్నందున  అదే రోజున ప్రమాణం చేసేందుకు  పార్టీలు  ఎక్కువగా  ప్రాధాన్యత ఇచ్చే అవకాశం లేకపోలేదు.

డిసెంబర్ 7వ తేదీన తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు పోలిం్ జరిగింది. డిసెంబర్ 11వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఫలితాలు మరికొద్దిగంటల్లో వెలువడే అవకాశం ఉండడంతో  ప్రధాన పార్టీలు  ఎన్నికల ఫలితాల అనంతరం  అనుసరించాల్సిన  వ్యూహంపై  ఇప్పుడే చర్చిస్తున్నారు.

ప్రజా కూటమి అధికారంలోకి  వస్తే కాంగ్రెస్ పార్టీ నేత ముఖ్యమంత్రి అవుతారు. అదే జరిగితే ఈ నెల 12వ, తేదీన కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్ష సమావేశం  ఏర్పాటు చేసే అవకాశం లేకపోలేదు.  అదే రోజున ముఖ్య మంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రచారం సాగుతోంది.  మంత్రులతో  ఆ తర్వాత ప్రమాణం చేసే అవకాశం ఉందంటున్నారు.

టీఆర్ఎస్‌కు మెజారిటీ వస్తే  రెండో సారి  కేసీఆర్ ముఖ్యమంత్రి పదవిని చేపడతారు. ఈ నెల 12వ తేదీన టీఆర్ఎస్ శాసనసభపక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఆ రోజు పంచమి. మంచి రోజు. ఈ నెల 12వ తేదీ తర్వాత  మంచి ముహుర్తాలు  లేవు.  దీంతో 12వ తేదీనే సీఎంగా ప్రమాణం చేసేందుకు ఎక్కువగా  పార్టీలు ఆసక్తి చూపే అవకాశాలు లేకపోలేదని అధికారులు చెబుతున్నారు.

ప్రజాకూటమిలోని పార్టీలకు  మేజిక్ ఫిగర్ కు సంబంధించిన ఫలితాలు వస్తే  ఆయా పార్టీలకు వచ్చిన సీట్ల ఆధారంగా మంత్రి పదవులు  దక్కే అవకాశం లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీలో కూడ మంత్రి పదవుల కోసం పెద్ద ఎత్తున పోటీ ఉండే చాన్స్ ఉంది.