ఆమనగల్లు: ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హస్తం ఉందని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నేత,  తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. అందుకు తెలంగాణ ప్రభుత్వం వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని ఆయన అన్నారు. 

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు చంద్రబాబు కుట్ర చేశారని నాయిని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా కడ్తాలలో గురువారం టీఆర్‌ఎస్‌ మండల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. 

అప్పట్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును అడ్డుకునేందుకు చంద్రబాబు అడుగడుగున ప్రయత్నించారని, ఢిల్లీలో చాలా మంత్రాంగం నడిపారని ఆయన అన్నారు. ఆంధ్రా గడ్డమాయన (చంద్రబాబు), తెలంగాణ గడ్డమాయన (ఉత్తమ్‌) ఎన్ని శక్తులొడ్డినా టీఆర్‌ఎస్ ను అడ్డుకోలేరని అన్నారు. 

తెలంగాణ జనసమితి (టీజెఎస్) అధ్యక్షుడు కోదండరాం సిగ్గు లజ్జ లేకుండా కాంగ్రెస్‌ తోనూ తెలంగాణకు అడ్డుపడ్డ ద్రోహులతోనూూ చేతులు కలిపారని వ్యాఖ్యానించారు.