హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం ఆస్తుల లెక్క తేల్చే పనిలో పడిన ఆదాయం పన్ను (ఐటి) శాఖ అధికారులకు విస్తుపోయే విషయాలు తెలిసి వస్తున్నాయి. కేసు విచారణలో భాగంగా నయీం భార్య హసీనా బేగంను ఐటి శాఖ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. నల్లగొండలోని ఇంటినీ, మరికొన్ని ఆస్తులను తాను టైలరింగ్ చేసి సంపాదించినట్లు ఆమె అధికారులకు చెప్పిన విషయం కూడా తెలిసిందే.

నయీం ఇంట్లో పట్టుబడిన వంట మనిషి ఫర్హానా పేరు మీద ఆస్తుల గురించి కూడా ఐటి శాఖ అధికారులు హసీనా బేగం వద్ద ఆరా తీశారు. ఫర్హానా పేరు మీద హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ల పరిధుల్లోనే కాకుండా రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో దాదాపు 30 నుంచి 40 ఇళ్లు, ఇంటి స్థలాలు ఉన్నట్లు సిట్ దర్యాప్తులో తేలింది. 

ఫర్హానా పేరు మీద ఉన్న ఆస్తుల విలువ వందల కోట్లు ఉంటుందని అంటన్నారు. ఈ కోణంలోనే హసీనా బేగం నుంచి ఐటి అధికారులు సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు. ఏ విధమైన ఆదాయ మార్గాలు లేకుండా నయీం సెటిల్మెంట్లతో పెద్ద ఎత్తున సంపాదించడానికి ఐటి శాఖ అధికారులు గుర్తించారు. 

కిడ్పాప్ లు, బెదిరింపులు, సెటిల్మెంట్లు, భూకబ్జాలతో నయీం సంపాదించిన ఆస్తులు బినామీల పేర్ల మీద ఉన్నట్లు ఐటి శాఖ గుర్తించింది. నయీం బినామీ ఆస్తుల విలువల మార్కెట్ రేట్ల ప్రకారం దాదాపు రూ.1200 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. 

Also Read: టైలరింగ్ ద్వారా సంపాదించా: ఐటీ అధికారులకు షాకిచ్చిన నయీం భార్య

తెలంగాణలోని వివిధ జిల్లాల్లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల్లో కూడా నయీంకు స్థిరాస్తులు ఉన్నట్లు సిట్ విచారణలో తేలింది. సోదాల్లో లభించిన పత్రాల ఆధారంగా నియాంకు 1015 ఎకరాల భూములు, ల్కషా 67 వేల 117 చదరపు అడుగుల ఇళ్ల స్థలాలు ఉన్నట్లు సిట్ గుర్తించింది. 

ఎన్ కౌంటర్ తర్వాత నయీం జెన్ లో నిర్వహించిన సోదాల్లో రూ.2.08 కోట్ల నగదు, 1.90 కిలోల బంగారు ఆభరణాలు, 258 సెల్ ఫోన్లు, వేర్వేరు వ్యక్తుల పేర్లతో ఉన్న 203 ఒరిజినల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, పేలుడు పదార్థాలు, ఖరీదైన కార్లు, టూవీలర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.