సూర్యాపేట: సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ పీఎస్ వద్ద యువకుడి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్యను ఆమె తల్లిదండ్రులు బలవంతంగా తీసుకెళ్తున్న పోలీసులు పట్టించుకోలేదని వాపోయాడు. 

తన భార్యను రక్షించి, తనకు అప్పగించాలని కోరినా పోలీసులు స్పందించకపోవడంతో ఆ యువకుడు పోలీస్ స్టేషన్ ఎదుట పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. పరిస్థితి విషమించడంతో సూర్యాపేట ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. 

ప్రస్తుతం నవీన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారం రోజుల క్రితం నవీన్ రెడ్డి ప్రేమించి ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. యువతి తల్లిదండ్రులు పెన్ పహాడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కౌన్సిలింగ్ కు నవీన్ దంపతులు పోలీస్ స్టేషన్ కు వచ్చారు. 

కౌన్సిలింగ్ అనంతరం నవీన్ ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని ఆమె తల్లిదండ్రులు తీసుకెళ్లిపోయారు. పోలీసులకు ఎంత చెప్పినా వినకపోవడంతో మనస్థాపానికి గురైన నవీన్ రెడ్డి పురుగులు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

మరోవైపు నవీన్ ప్రేమించి పెళ్లిచేసుకున్న యువతి తల్లిదండ్రులతో ఇష్టపూర్వకంగానే వెళ్లిందని బలవంతంగా వెళ్లలేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. బలవంతంగా తీసుకెళ్తే తాము అడ్డుకునేవాళ్లమని చెప్పుకొచ్చారు.