తెలంగాణలో ముందస్తు ఎన్నికల హడావుడి మొదలైంది. సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికే మొగ్గు చూపడంతో పలువురు నాయకులు తమ రాజకీయా భవిష్యత్ పై దృష్టి సారించారు. ఇప్పుడున్న పార్టీలో సీటు రాకుంటే వేరే పార్టీలోకి జంప్ చేయడానికి పలువురు నాయకులు ప్రయత్నిస్తున్నారు. తాజాగా అధికార టీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ఓ నాయకుడు మళ్లీ సీటు రాదని గ్రహించి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాడు. 

మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇంచార్జి శివకుమార్ రెడ్డి గత కొద్ది రోజులుగా పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో సీనియర్ల కంటే వలసవచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొంటూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.  ఇతడు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి కుంతియా , టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో శివకుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

2014 ఎన్నికల్లో శివకుమార్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా బరిలోకి దిగారు. అయితే టిడిపి అభ్యర్థి రాజేందర్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యాడు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా రాజేందర్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరడంతో శివకుమార్ రెడ్డి ప్రాధాన్యత తగ్గింది. పార్టీ ఇంచార్జీగా ఉన్నప్పటికి నియోజకవర్గంలో తన మాట చెల్లడం లేదంటూ  అతడు  గతంలో ఆరోపించిన విషయం తెలిసిందే. 

టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తులను చేర్చుకోడానికి కాంగ్రెస్ పార్టీ పథకం రచించింది. ఇందులో భాగంగానే మొదట నారాయణపేట ఇంచార్జి శివకుమార్ రెడ్డిని తమ పార్టీలో చేర్చుకోవడంతో సఫలమైంది. ఇంకా చాలామంది తమ పార్టీలో చేరడానికి సిద్దంగా ఉన్నట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.