హైదరాబాద్: తెలంగాణ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించే అవకాశాన్ని మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ బిజెపి పెద్ద జోక్యంతో కోల్పోయినట్లు తెలుస్తోంది. ఆరుగురు కొత్త మంత్రులతో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం చేయించిన విషయం తెలిసిందే. తాను గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన ఐదు గంటలకే ఆమె మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. 

బిజెపి పెద్దలు జోక్యం చేసుకోకపోతే నరసింహన్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించి ఉండేవారని అంటున్నారు. కేసీఆర్ కొత్త మంత్రులతో నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించి ఉంటే దేశంలోనే ఐదు ప్రభుత్వాల్లో ప్రమాణ స్వీకారం చేయించిన తొలి గవర్నర్ గా రికార్డులకు ఎక్కి ఉండేవారు. 

తమిళిసై సౌందర రాజన్ సెప్టెంబర్ 11వ తేదీన ప్రమాణ స్వీకారం చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే, అకస్మాత్తుగా ఆమె ప్రమాణ స్వీకారం చేసే తేదీ ముందుకు జరిగింది. నరసింహన్ 11వ తేదీ వరకు గవర్నర్ గా ఉంటే కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించి ఉండేవారు 

అయితే, తొలుత మాత్రం తమిళిసై సౌందరరాజన్ 8వ తేదీన ప్రమాణ స్వీకారం చేయడానికి అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. చర్చల సందర్బంగా 11వ తేదీకి తన ప్రమాణ స్వీకారం చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో బిజెపి ఢిల్లీ పెద్దలు రంగంలోకి దిగి మొదట అంగీకరించే తేదీకే కట్టుబడి ఉండాలని చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో తమిళిసై సౌందరరాజన్ 8వ తేదీననే ప్రమాణ స్వీకారం చేశారు.