మహాకూటమి నుంచి టీడీపీ అభ్యర్థిగా కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగిన నందమూరి సుహాసిని.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. టీఆర్ఎస్ నేత మాధవరం కృష్ణరావు ఆ నియోజకవర్గంలో అఖండ విజయం సాధించారు. దివంగత నేత నందమూరి హరికృష్ణ కుమార్తెగా ఎన్నికల బరిలోకి తొలిసారి అడుగుపెట్టిన ఆమెకు చేదు అనుభవం ఎదురైంది.

ఆమె గెలుపు కోసం టీడీపీ నేతలు, చంద్రబాబు ఎంత కృషి చేసినా ఫలితం దక్కలేదు. కాగా.. తన ఓటమికి గల కారణాలపై నందమూరి సుహాసిని ఇప్పుడు ఆరా తీయడం మొదలుపెట్టారు.  ఏయే కారాణాల వల్ల ఎన్నికల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చిందనే విషయంపై ఆమె ఆరా తీస్తున్నారట. ఈ మేరకు పార్టీ నేతలు, కార్యకర్తలతో ఈ రోజు సాయంత్రం ప్రత్యేకంగా సమావేశమౌతున్నట్లు సమాచారం.

కేపీహెచ్‌బీ తొమ్మిదో ఫేజ్‌లోని కార్యాలయంలో సాయంత్రం 5.30 గంటలకు సమావేశం ఉంటుందని ఆ పార్టీ నాయకులు ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల సాధారణ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలతో పాటూ భవిష్యత్‌లో పార్టీ కార్యచరణపై చర్చించనున్నట్లు సమాచారం.