తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 23వ వర్థంతి సందర్భంగా నందమూరి కుటుంబసభ్యులు ఆయనకు నివాళులర్పించారు. అయితే బాబాయ్-అబ్బాయ్‌లు విడివిడిగా నివాళులర్పించడం రాజకీయంగా చర్చకు దారి తీసింది.

తెల్లవారుజామున జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కలిసి ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చి నివాళులు ఆర్పించారు. వారు వెళ్లిపోయిన కాసేపటికి బాలకృష్ణ, నందమూరి సుహాసినీ, దర్శకుడు క్రిష్ పుష్పాంజలి ఘటించారు.

ఎన్టీఆర్‌ బయోపిక్‌ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో బాబాయ్ - అబ్బాయ్ సందడి చేయడంతో వీరి మధ్య మనస్పర్థలు సద్దుమణిగాయని అందరూ భావించారు. మరోవైపు బయోపిక్‌లో నందమూరి హరికృష్ణగా నటించిన కళ్యాణ్ రామ్ సైతం బాబాయ్‌తో కలిసి రాకుండా సోదరుడితో వేకువ జామునే రావడం పలువురిని విస్మయానికి గురిచేసింది. 

అంతకు ముందు బాలకృష్ణ మాట్లాడుతూ..ఒక మనిషి మహోన్నతుడు కావాలంటే అకుంఠిత దీక్షకావాలి, సత్సంకల్పం కావాలని, నమ్మిన దారిలో ఎన్ని కష్టాలు ఎదురైనా ముందుకు నడవాలని ఎన్టీఆర్ రుజువు చేశారని బాలకృష్ణ అన్నారు.

ఎంత మంది నాయకులు వచ్చినా, ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన అవన్నీ ఎన్టీఆర్ ముందు చేసినవేనని బాలయ్య వ్యాఖ్యానించారు. లంచగొండితనం ఇష్టం లేక ప్రభుత్వోద్యోగానికి రాజీనామా చేశారన్నారు. సినిమాల్లో ఎదురులేకుండా సాగిన ఆయన రాజకీయాల్లోనూ అంతే స్థాయిలో వెలుగొందారని పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యారని గుర్తు చేశారు.

బడుగు బలహీన వర్గాలకు, వెనుకబడిన వారికి రాజ్యాధికారాన్ని అందించిన ఘనత ఎన్టీఆర్‌దేనని బాలయ్య అన్నారు. భౌతికంగా మన మధ్య లేకపోయినా తెలుగుజాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ మనతోనే ఉంటారన్నారు.  అన్నగారు ఏ ఆశయాల కోసం కృషి చేశారో వాటి కోసం పనిచేస్తామన్నారు.