BegumBazar Honor Killing : నిందితుల కస్టడీకి కోర్ట్ అనుమతి.. నాలుగు రోజులు పాటు విచారించనున్న పోలీసులు
బేగంబజార్ పరువు హత్య కేసు నిందితుల పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. దీంతో పోలీసులు వారిని తమ అదుపులోకి తీసుకున్నారు. నాలుగు రోజులు పాటు వారిని పోలీసులు విచారించనున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బేగంబజార్ పరువు హత్య కేసు నిందితుల పోలీస్ కస్టడీకి న్యాయస్థానం అంగీకరించింది. ఈ మేరకు నాలుగు రోజుల కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు షాహినాథ్ గంజ్ పోలీసులు. ఇకపోతే.. Begum Bazar Honour Killing కేసులో నిందితులకు రక్షణ కల్పించాలని నిందితుల పేరేంట్స్ హెచ్ఆర్‌సీలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ కేసులో మరో ఇద్దరు మైనర్లను శుక్రవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు.
బేగంబజార్ లో Neeraj Pawarను ఆయన భార్య సంజన కుటుంబ సభ్యులు ఈ నెల 20వ తేదీ రాత్రి హత్య చేశారు. కర్రలు, రాడ్లతో ఆయనపై దాడికి దిగారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నీరజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ కేసులో ఇప్పటికే 9 మందిని అరెస్ట్ చేయగా.. ఇవాళ మరో ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితులను ఎన్ కౌంటర్ చేస్తారనే భయంతో నిందితుల పేరేంట్స్ తమ వారికి రక్షణ కల్పించాలని కోరుతూ ఇవాళ HRC లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో సంబంధం లేని వారిని కూడా కేసులో ఇరికిస్తున్నారని పోలీసులపై నిందితుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
బేగంబజార్ కోల్సావాడి ప్రాంతానికి చెందిన నీరజ్ పన్వర్ పల్లీల వ్యాపారం చేస్తుంటాడు. అదే ప్రాంతానికి చెందిన సంజనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి నెల క్రితం బాబు పుట్టాడు. అయితే సంజనను పెళ్లి చేసుకున్న నీరజ్‌పై ఆమె కుటుంబ సభ్యుల కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం Sanjana సోదరులు, వారి స్నేహితులు.. నీరజ్ తన తాతయ్యతో కలిసి బైక్‌పై బంధువుల ఇంటికి వెళ్తుండగా కత్తులు, బండరాళ్లతో దాడికి పాల్పడ్డారు.
మరోవైపు.. పరువు హత్య కేసుకు సంబంధించి మృతుడు నీరజ్ పన్వార్ భార్య సంజన కుటుంబ సభ్యులు స్పందించారు. నీరజ్ హత్యకు సంబంధించి తమ కుటుంబంపై వస్తున్న ఆరోపణలను సంజన తల్లి మధుబాయి ఖండించారు. ఈ హత్యతో తమ కుటుంబానికి సంబంధం లేదని చెప్పారు. నీరజ్‌ను ఎవరు చంపారో తమకు తెలియదని సంజన తల్లి చెప్పారు. నీరజ్‌ను హత్య చేసినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హత్య జరిగిన సమయంలో తన కుమారుడు కూడా ఇంట్లోనే ఉన్నారని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటన గురించి తెలియగానే భయంతో ఇంట్లోంచి పారిపోయారని ఆమె తెలిపారు.
సంజన దంపతులు సుఖంగా ఉంటే చాలనుకున్నామని చెప్పారు. అయితే కొన్ని రోజులుగా అల్లుడు నీరజ్‌ను చంపుతామని కొందరు బెదిరస్తూ వచ్చారని, వారెవరో మాత్రం తమకు తెలియదని అన్నారు. తన కుమార్తె సంసారాన్ని నాశనం చేశారని.. తన అల్లుడిని హత్య చేసిన వాళ్లను ఉరితీయాలని డిమాండ్ చేశారు. సంజన సోదరి మమత మాట్లాడుతూ.. ఈ హత్యతో తమ కుటుంబానికి సంబంధం లేదని చెప్పారు. ప్రేమ వివాహం ఇష్టలేకే ఏడాది పాటు సంజనతో మాట్లాడకుండా దూరంగా పెట్టామని ఆమె పేర్కొన్నారు. తన తల్లి ఆరోగ్యం బాగాలేకపోవడంతో సంజనతో రెండు మాట్లాడుతున్నట్టుగా చెప్పారు.