రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక తెలంగాణ లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్నది. ఖాళీగా ఉన్న మూడు స్థానాలను టిఆర్ఎస్ సునాయాసంగా గెలుచుకోనుంది. దీంతో అభ్యర్థుల ఎంపిక క్షణ క్షణం టెన్షన్ పుట్టిస్తున్నది. రోజుకో కొత్త పేరు తెరపైకి రావడంతో టిఆర్ఎస్ వర్గాల్లోనే కాకుండా మిగతా రాజకీయ పక్షాల్లోనూ హాట్ టాపిక్ అయితున్నది.

ఇప్పటి వరకు కేసిఆర్ కు అత్యంత సన్నిహితుడు, స్వయాన సడ్డకుని కొడుకు, టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్ పేరు ఖరారైంది. ఇక రెండో సీటు యాదవులకు కట్టబెడతానని కేసిఆర్ గతంలోనే ప్రకటించారు. మూడో సీటుపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే రెండో సీటు విషయంలో నీకా.. నాకా అన్నట్లు ప్రతిక్షణం కొత్త మలుపులు తిరుగుతున్నది. తాజాగా యాదవుల కోటా సీటులో నల్లగొండ నేత బడుగుల లింగయ్య యాదవ్ పేరు అనూహ్యంగా తెర మీదకు వచ్చింది. నల్లగొండ బడుగుల లింగయ్య యాదవ్ పిడుగులా రాజ్యసభ రేస్ లోకి ఎలా వచ్చారబ్బా అని టిఆర్ఎస్ శ్రేణులు ఆశ్చర్యపోతున్నాయి.

నల్లగొండ ఉమ్మడి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి సుదీర్ఘ కాలం అధ్యక్షుడిగా పనిచేశారు బడుగుల లింగయ్య యాదవ్. ఆ తర్వాత కాలంలో తెలంగాణ వచ్చిన తర్వాత టిడిపి మసకబారిపోతున్న వేళ బంగారు తెలంగాణ నిర్మాణం కోసం టిడిపిని వీడి టిఆర్ఎస్ పార్టీలో చేరారు బడుగుల. టిఆర్ఎస్ లో చేరిన తర్వాత ఆయనకు చాలాకాలం పాటు పార్టీలో గుర్తింపు దక్కలేదు. అయితే అప్పుడు బడుగుల టిడిపిలో చేసిన కష్టానికి టిఆర్ఎస్ లో ఫలితం దక్కిందన్నట్లుగా టిఆర్ఎస్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

బడుగుల లింగయ్య యాదవ్ సుమారు 15 సంవత్సరాల పాటు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి నల్లగొండ జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు. నల్లగొండ టిడిపి చరిత్రలో అంత సుదీర్ఘ కాలం పార్టీ అధ్యక్షుడిగా పనిచేసింది బగుగుల మాత్రమే. అయితే టిడిపి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే బడుగులకు, కేసిఆర్ కు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు చెబుతున్నారు. అప్పట్లో కేసిఆర్ వ్యవహార శైలి, వర్కింగ్ స్టైల్ ని బడుగుల చాలా ఇష్టపడేవారని నల్లగొండలో టిడిపిని వీడి టిఆర్ఎస్ లో చేరిన ఒక నేత వివరించారు. టిడిపిలో ఉన్న స్నేహం కారణంగానే బడుగుల లింగయ్య యాదవ్ ను గుర్తు పెట్టుకుని కేసిఆర్ అవకాశం కల్పిస్తున్నడని హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ బడుగల రాజకీయ చరిత్ర

నల్లగొండ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత బడుగుల లింగయ్య యాదవ్ సుదీర్ఘ కాలం పటు టిడిపిలో సేవలందించారు. టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేస్తున్న కాలంలో  బడుగుల లింగయ్య యాదవ్ 2015 మార్చి 13వ తేదీన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. కేతేపల్లి మండలం బీమారం గ్రామానికి చెందిన బడుగుల లింగయ్య, టీడీపీ స్థాపించిన 1982 నుంచి పార్టీలో కొనసాగారు. పదేండ్ల్లపాటు పార్టీ మండలశాఖ అధ్యక్షుడిగా పనిచేశారు. పదకొండు ఏండ్ల్లపాటు పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడిగా పనిచేశారు. బీమారం గ్రామంలో ఎంపిటిసిగా పోటీ చేసి గెలుపొందారు. తర్వాత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో నల్లగొండ జిల్లా నుంచి పోటీ చేసి ప్రస్తుత శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ మీద ఓడిపోయారు.

2015 మార్చి 16వ తేదీన బడుగల టిఆర్ఎస్ పార్టీలో చేరారు. టిఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత జిల్లా రాజకీయాలను పెద్దగా ప్రభావితం చేసిన దాఖలాలు లేవు. అయితే సూర్యాపేట మంత్రి జగదీష్ రెడ్డితో సత్సంబంధాలు కలిగిన కారణంగా అనూహ్యంగా బడుగుల లింగయ్య యాదవ్ పేరు రాజ్యసభ రేస్ లోకి వచ్చిందని చెబుతున్నారు. బడుగుల పేరు తెర మీదకు రావడంతో రాజ్యసభ సీటుపై ఆశలు పెట్టుకున్న జైపాల్ యాదవ్, కన్నెబోయిన రాజయ్య యాదవ్, నోముల నర్సింహ్మయ్య, డాక్టర్ రవి కిరణ్ యాదవ్, తుల ఉమ, ఎంబి కృష్ణ యాదవ్ లాంటి వారి ఆశలు ఆవిరైపోయినట్లేనని చెబుతున్నారు.