మాజీ ఎమ్మెల్యే చందర్ రావుతో ఉత్తమ్ భేటీ:కాంగ్రెస్ లోకి వేనేపల్లి
కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావుతో నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ భేటీ అయ్యారు.
కోదాడ: కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావుతో టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారంనాడు భేటీ అయ్యారు . వేనేపల్లి చందర్ రావు సహా కొందరు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.ఈ ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత నెలకొంది.
ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో కోదాడ అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా వేనేపల్లి చందర్ రావు పలు దఫాలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 ఎన్నికలకు ముందు వేనేపల్లి చందర్ రావు టీడీపీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. గత ఎన్నికల సమయంలో టీడీపీని వీడి బీఆర్ఎస్ లో చేరిన బొల్లం మల్లయ్య యాదవ్ కు ఆ పార్టీ టిక్కెట్టు కేటాయించింది. గత ఎన్నికల్లో బొల్లం మల్లయ్య యాదవ్ కాంగ్రెస్ అభ్యర్ధి నల్లమాద పద్మావతిపై స్వల్ప ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే ఎమ్మెల్యేగా విజయం సాధించిన బొల్లం మల్లయ్య యాదవ్ అందరితో కలుపుగోలుగా లేడని ఆయన వైరి వర్గం ఆరోపణలు చేస్తుంది.
బొల్లం మల్లయ్య యాదవ్ కు టిక్కెట్టు కేటాయించవద్దని స్థానిక నేతలు పార్టీ నాయకత్వాన్ని కోరింది. అభ్యర్థుల ప్రకటన తర్వాత కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావును కలిసేందుకు బొల్లం మల్లయ్య యాదవ్ ఆయన ఇంటికి వచ్చారు. కానీ బొల్లం మల్లయ్యను కలిసేందుకు వేనేపల్లి చందర్ రావు నిరాకరించారు. దీంతో అరగంట పాటు చందర్ రావు నివాసంలో గడిపి చందర్ రావును కలవకుండానే బొల్లం మల్లయ్య యాదవ్ వెళ్లిపోయారు.
బీఆర్ఎస్ నాయకత్వం తమ అసంతృప్తిని పట్టించుకోలేదనే కారణంగా కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావిస్తున్నారని ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వేనేపల్లి చందర్ రావుతో భేటీ అయ్యారు.
also read:పరకాల నుండి బరిలోకి:కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్న రేవూరి
గతంలో కోదాడ అసెంబ్లీ స్థానం నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా విజయం సాధించిన విషయం తెలిసిందే. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. దీంతో కోదాడ, హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానాలుగా విభజించారు. దీంతో హుజూర్ నగర్ నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ నుండి ఆయన సతీమణి పద్మావతి పోటీ చేస్తున్నారు. ఈ దఫా కూడ ఈ రెండు స్థానాల నుండి భార్యభర్తలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు.