వయసును, ప్రతికూల వాతావరణాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా నల్గొండకు చెందిన దంపతులు అరుదైన ఘనత సాధించారు. ఐరోపా ఖండంలోనే అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ ఎల్బ్రస్‌ను అధిరోహించారు
ఐరోపా ఖండంలోనే అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ ఎల్బ్రస్‌ను అధిరోహించారు నల్గొండ దంపతులు. నిడమానూరుకు చెందిన చాపల వెంకట రెడ్డి (52), విజయలక్ష్మీ (50)లు వయసును లెక్క చేయకుండా ఈ ఘనత సాధించారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోన్న విజయలక్ష్మీకి పర్వతారోహణపై మక్కువ ఎక్కువ. ఈ క్రమంలో ఇప్పటికే ఉత్తరాఖండ్‌లోని రుథుగైరా, ఆఫ్రికా ఖండంలోని కిలిమంజారో పర్వతాలను అధిరోహించారు. అయితే ఈసారి ఈ దంపతులు సాహసం చేశారు.
ఐరోపాలోనే అత్యంత ఎత్తైన పర్వతమైన మౌంట్ ఎల్బ్రస్ (5,642)ను కేవలం ఆరు గంటల వ్యవధిలోనే అధిరోహించారు. ఈ నెల 9న హైదరాబాద్ నుంచి విదేశీ పర్యటనకు బయల్దేరిన వారు ఆ తర్వాతి రోజు రాత్రి రష్యా రాజధాని మాస్కోకు చేరుకున్నారు. అక్కడి నుంచి మౌంట్ ఎల్బ్రస్ సమీపంలోని మినరల్ నీవాడీకి చేరుకున్నారు. మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రత, గంటకు 50 కి.మీ వేగంతో వీచే చల్లని గాలులు వంటి ప్రతికూల పరిస్ధితుల్లో ఆగస్ట్ 14 అర్థరాత్రి పర్వతారోహణ కార్యక్రమాన్ని చేపట్టి.. 15న ఉదయం 5.50 గంటలకు శిఖరాన్ని చేరుకున్నారు. సరిగ్గా అదే రోజున భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో మౌంట్ ఎల్బ్రస్‌పై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.
