ఎమ్మెల్సీ, లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తెలంగాణ కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించిన నల్గొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మరో సంచలన ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచాను కాబట్టి ఈ పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ తరపున మళ్లీ ఫోటీ చేయనున్నట్లు తాజా ప్రకటించారు.

రాజీనామా ప్రకటన చేసిన తర్వాత మొదటిసారి లింగయ్య ఆదివారం మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ది, సంక్షేమ పథకాలను చూసే టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు...తనకు ఎలాంటి పదవిపై ఆశ లేదని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్దికోసం పనిచేస్తుంటే కాంగ్రెస్ అందుకు సహకరనించకపోగా కేసులు, పిర్యాదులతో దాన్ని అడ్డుకుంటోంది. ఇలాంటి అభివృద్ది నిరోధకులతో కలిసి వుండలేకే టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు లింగయ్య తెలిపారు. 

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరపున హేమాహేమీ నాయకులున్నారని...కానీ వారు సొంత జిల్లాకు చేసిందేమీ లేదని లింగయ్య విమర్శించారు. వారంత తమ సొంత రాజకీయాల కోసమే జిల్లా పేరును వాడుకున్నారని అన్నారు. కానీ కేసీఆర్ మాత్రం జిల్లా అభివృద్దికి కృషిచేస్తున్నారని... అలాంటి నాయకుడికి సహాయ సహకారాలు అందించాలనే పార్టీ మారుతున్నట్లు లింగయ్య వివరించారు.