తెలంగాణ అపద్ధర్మ మంత్రి కేటీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఇటీవల మల్కాజ్‌గిరికి చెందిన దివ్యాంగురాలు షేక్ నఫీస్ రవీంధ్రభారతిలో ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను కేటీఆర్ సందర్శించారు. మస్క్యులార్ డిస్ట్రోఫీ వ్యాధితో బాధపడుతున్నప్పటికీ.. పట్టుదలతో చిత్రకళను కొనసాగిస్తుండటాన్ని కేటీఆర్ అభినందించారు..

అన్ని విధాలా తనని ఆదుకుంటానని.. కళను మరింత ప్రొత్సహిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.. ఈమెకు జీవితాంతం పెన్షన్ వచ్చేలా ఏర్పాట్లు చేయాలని... అలాగే వైద్యానికి అవసరమైన సహాయాన్ని నిమ్స్‌లో అందించేందుకు చర్యలు తీసుకోవాలని సాంస్కృతిక శాఖ అధికారులను ఆదేశించారు.

ఆయన ఆదేశాల మేరకు రూ. 10 లక్షలు జాయింట్ అకౌంట్‌లో జమ చేయడంతో పాటు నెలకు రూ.10 వేలు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించిన జీవో కాపీని తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ నఫీస్‌కు అందించారు. ఈ సందర్భంగా నఫీస్ కుటుంబసభ్యులు కేటీఆర్‌కు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.