Asianet News TeluguAsianet News Telugu

దమ్మాయిగూడ చిన్నారి మృతి కేసులో వీడిన మిస్టరీ.. అసలేం జరిగిందంటే..?

హైదరాబాద్ శివార్లలోని దమ్మాయిగూడ అంబేడ్కర్‌ నగర్‌లో జరిగిన బాలిక ఇందు (10) అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడింది. బాలిక ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. 

Mystery Reveled In Dammaiguda Missing Girl Indu Death Case
Author
First Published Dec 19, 2022, 12:40 PM IST

హైదరాబాద్ శివార్లలోని దమ్మాయిగూడ అంబేడ్కర్‌ నగర్‌లో జరిగిన బాలిక ఇందు (10) అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడింది. బాలిక ప్రమాదశాత్తు చెరువులో పడి ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇందు మృతిపై అనుమానాలు లేవని శవపరీక్ష నివేదికలో వైద్యులు వెల్లడించారు. చెరువులో జారిపడటంతో బాలిక ఊపిరితిత్తుల్లోకి నీరు చేరినట్లు పోస్టుమార్టం నివేదికలో వైద్యులు తెలిపారు. ఈ నెల 15న (గురువారం)  పాఠశాలకెళ్లి బాలిక అదృశ్యమై.. అనుమానాస్పద స్థితిలో చెరువులో మృతదేహంగా కనిపించడం కలకలం రేపింది. ఈ కేసులో మిస్టరీని తొలగించడానికి కేసు దర్యాప్తు కోసం 10 బృందాలను పోలీసులు ఏర్పాటు చేశారు. సైంటిఫిక్ ఎవిడెన్స్‌తో పాటు, హ్యుమన్ ఇంటెలిజెన్స్‌తో విచారణ చేశారు.  

వివరాల్లోకెళ్తే.. జవహర్‌నగర్‌ పరిధి ఎన్టీఆర్‌నగర్‌కాలనీలో నివసిస్తున్న జీడల నరేష్‌ దంపతులు పాత సామగ్రి సేకరిస్తూ జీవనం సాగిస్తున్నారు. అతనికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు. ఈ ముగ్గురు పిల్లలు దమ్మాయిగూడలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. గురువారం ఉదయం నరేష్ తన చిన్న కుమార్తె ఇందు(10), కుమారుడి(12)ని తన ద్విచక్రవాహనంపై పాఠశాలకు బయలుదేరాడు. కానీ.. అర్జెంట్ గా వేరే పని పడటంతో ఆ పిల్లలిద్దరిని మధ్యలో దింపి.. నడుచుకుంటూ పాఠశాలకు వెళ్లమని చెప్పారు. తండ్రి చెప్పినట్టుగానే వారు బడికెళ్లారు. కానీ.. ఇందు తన పుస్తకం మరిచిపోయాని.. ఇంటికి వెళ్లి పుస్తకం తెచ్చుకుంటానని ఒంటరిగా పాఠశాల నుంచి బయటికెళ్లింది. విద్యార్థిని రాలేదని గుర్తించి.. ఆ పాఠశాల ఉపాధ్యాయుడు వెంటనే కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. వారు కాసేపు పరిసర ప్రాంతాలను వెతికి ..100కు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సాయంత్రం వరకూ పరిసర ప్రాంతాల్లో గాలించారు. కానీ.. బాలిక  ఆచూకీ తెలియలేదు. దీంతో పోలీసులు రాత్రి సమయంలో డాగ్‌స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. ఆ డాగ్ స్క్వాడ్ గ్రూప్ చివరికి పాఠశాల నుంచి దమ్మాయిగూడ చెరువుకు చేరింది.  

మరోవైపు.. సీసీఫుటేజీలను పరిశీలించిన పోలీసులు.. బాలిక గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో  పాఠశాల నుంచి ఒంటరిగా వెళ్తున్నట్లు  గుర్తించారు. మరిన్ని ఫుటేజీల్లో దమ్మాయిగూడ చెరువు మార్గంలో బాలిక పరిగెత్తుకుంటూ వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. బాలిక మృతదేహానికి చెరువులో గుర్తించారు. అనంతరం బాలిక మృతదేహానికి గాంధీ ఆస్పత్రి వైద్యులు పోస్టుమార్టం చేశారు. ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతోనే బాలిక మృతిచెందినట్లు వైద్యులు తమ నివేదికలో పేర్కొన్నారని పోలీసులు వెల్లడించారు. దీంతో బాలిక అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడింది. బాలిక ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios