తెలంగాణలోని మేడ్చెల్ జిల్లా జవహర్ నగర్ లో ఇటీవల ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి చనిపోయిన సంగతి తెలిసిందే. చెట్టుకు వేలాడుతూ.. వారి శవాలు కనిపించాయి. కాగా.. వీరి మృతిపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.

మృతికి కుటుంబ కలహాలా, ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లాక్‌డౌన్‌ ఉండగా కరీంనగర్‌ నుంచి ఎలా వెళ్లారు..? ఎందుకు వెళ్లారు..? ఎవరు సహకరించారు..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

 ఈ నెల 10న కొత్తపల్లి మండలం రేకుర్తిలో ఒక సేవా కార్యక్రమంలో పాల్గొన్న వీళ్లు ఏ కారణంతో వెళ్లారనేది మిస్టరీగా మారింది. కరీంనగర్‌ పట్టణంలో నివాసం ఉంటున్న అనూష(26), సుమతి(29) మృతదేహాలు సోమవారం ఉదయం మేడ్చల్‌ జవహర్‌నగర్‌ పరిసరాల్లో వేలాడుతూ కనిపించగా, అనూష కూతురు ఉమామహేశ్వరి(8) బాత్రూం శుభ్రం చేసే రసాయనాలు తాగి మృతిచెంది ఉంది. 

ఈ నెల 10న పేదకూలీలకు కరీంనగర్‌ శివారు రేకుర్తిలో మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగిన బియ్యం పంపిణీ వారు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలస్యంగా ఇంటికి వెళ్లడంతో కుటుంబ సభ్యులు మందలించారని తెలిసింది. అదే రోజు సాయంత్రం మేడ్చల్‌ జవహార్‌నగర్‌కు పయనమైనట్లు సమాచారం. 

అయితే... అనూష భర్త కాకుండా మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కూడా పెట్టుకున్నట్లు అనుమానం ఉంది. సదరు వ్యక్తి జవహర్ నగర్ లోనే ఉంటాడని తెలుస్తోంది. అయితే.. అసలు లాక్ డౌన్ సమయంలో వారు 160కిలోమీటర్ల దూరం ఎలా వెళ్లారు అనేది మాత్రం మిస్టరీ గా ఉందని పోలీసులు చెబుతున్నారు. దీనిపై విచారణ కొనసాగుతోంది.