కెనడాలో ఒంటరిగా వదిలి చెప్పాపెట్టకుండా తన భర్త ఇండియాకు వెళ్లాడని మూడు నెలల గర్భిణీ అక్కడి భారత హైకమిషన్‌లో ఫిర్యాదు చేశారు. దయచేసి తన భర్త ఆచూకీని కనిపెట్టాలని విజ్ఞప్తి చేశారు. తన భర్త, ఆయన కుటుంబ సభ్యులందరూ తన ఫోన్ నెంబర్‌ను బ్లాక్ చేశారని తెలిపారు. ఇదే ఫిర్యాదును పేర్కొంటూ కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ను ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు. 

న్యూఢిల్లీ: తన భర్త చెప్పాపెట్టకుండా ఇండియాకు వెళ్లిపోయాడని, మూడు నెలల గర్భిణి అయిన తనను కెనడాలో ఒంటిగా వదిలేసి వెళ్లాడని ఓ తెలుగు మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి తన భర్తను వెతికిపెట్టాలని కెనడాలోని భారత హైకమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్‌లో విజ్ఞప్తి చేశారు.

తన భర్త అనుగుల చంద్రశేఖర్ రెడ్డి కెనడాలోని మెక‌గ్రిల్ వర్సిటీలో పనిచేస్తున్నారని, తనకు చెప్పకుండానే ఆగస్టు 9న ఇండియాకు బయల్దేరి వెళ్లాడని ఆమె వివరించారు. అప్పటి నుంచి తన భర్త, భర్త కుటుంబమూ కాంటాక్ట్‌లో లేకుండా పోయారని, వాళ్ల కుటుంబ సభ్యులందరూ తన నెంబర్‌ను బ్లాక్ చేశారని తెలిపారు. తాను గర్భిణీ కావడంతో ప్రయాణం చేయలేకపోతున్నారని పేర్కొన్నారు.

Scroll to load tweet…

తన భర్త సోదరుడు హైదరాబాద్‌లో కానిస్టేబుల్ అని ఆమె తెలిపారు. బహుశా తన భర్తను, తన భర్త కుటుంబీకులను ఈయనే దాచి ఉంటారనీ అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికైతే తన భర్త ఆచూకీ లేదని వివరించారు. ఆయన ఆరోగ్యంపైనా ఆందోళన ఉన్నదని తెలిపారు. దయచేసి ఆయన ఎక్కడ ఉన్నాడో వెతకాలని కోరారు. తన భర్త ఆచూకీని కనుగొనాలని భారత హైకమిషన్‌కు ఆగస్టు 20న ఫిర్యాదు చేసినట్టు వివరించారు.