Asianet News TeluguAsianet News Telugu

సైకిల్ పోయిందని పోలీసులకు ఆరో తరగతి విద్యార్థి ఫిర్యాదు.. ఫోన్‌లో తండ్రి సమాధానంతో షాక్

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన 11 ఏళ్ల బాలుడు సాత్విక్ సంక్రాంతి సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి వెళ్లి వచ్చాడు. ఇంటికి వచ్చాక చూస్తే తన సైకిల్ కనిపించకుండా పోయింది. దీంతో ఆ ఆరో తరగతి పిల్లాడు నేరుగా బెజ్జంకి పోలీసు స్టేషన్ వెళ్లి తన సైకిల్ పోయిందని ఫిర్యాదు చేశాడు. వెంటనే వెతికి పెట్టాల్సిందిగా పోలీసులను కోరాడు. ఈ ఫిర్యాదు విని ఎస్సై ఆవుల తిరుపతి షాక్ అయ్యారు. ఆ బాలుడికి భరోసా ఇచ్చి సాత్విక్ తండ్రికి ఫోన్ చేశాడు. సాత్విక్ తండ్రి సమాధానం విని షాక్ అయ్యారు. అయితే, ఆ బాలుడు ఒక్కడే ధైర్యంగా పోలీసు స్టేషన్ రావడాన్ని ఎస్సై అభినందించారు.
 

my bicycle lost.. boy compained to bejjanki police
Author
Hyderabad, First Published Jan 20, 2022, 6:14 PM IST

బెజ్జంకి: సిద్దిపేట(Siddipet) జిల్లా బెజ్జంకి(Bejjanki) మండల కేంద్రంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పదకొండేళ్ల బాలుడు పోలీసు స్టేషన్(Police Station) వెళ్లి.. ఫిర్యాదు చేశాడు. తన సైకిల్(Bicycle) పోయిందని ఫిర్యాదు(Complaint) చేశాడు. తన సైకిల్‌ను వెతికి పెట్టాల్సిందిగా కోరాడు. ఎవరి సహాయం లేకుండా ధైర్యంగా ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఆ ఆరో తరగతి విద్యార్థిని పోలీసులు ప్రశంసించారు. ఆ బాలుడి తండ్రికి ఫోన్ చేశారు. ఫోన్‌లో ఆ పిల్లాడి తండ్రి షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు.

పోలీసులంటే ధైర్యంతోపాటు ఒకింత భయం ఉండటం సహజమే. అందుకే ఏదైనా గొడవ జరిగినా.. చోరీ జరిగినా పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలంటే పెద్దల్లోనూ కొంత జంకు ఉంటుంది. అలాంటిది ఆరో తరగతి చదువుతున్న పిల్లాడు ధైర్యంగా తన సమస్యను చెప్పుకోవడానికి వెళ్లాడు. తన గోడు చెప్పుకుని పరిష్కరించాల్సిందిగా కోరాడు.

సంక్రాంతి సెలవుల కోసం బెజ్జంకికి చెందిన భువనగిరి సాత్విక్ అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లాడు. పండుగ తర్వాత మళ్లీ స్వగ్రామానికి వచ్చాడు. ఇంటికి వచ్చి ఎప్పుడూ తాను ఆడుకునే సైకిల్ కోసం వెతికాడు. కానీ, ఎంత వెతికినా.. ఆ సైకిల్ దొరకలేదు. ఎలాగైనా తన సైకిల్ దొరకబట్టాలని పూనుకున్నాడు. అందుకోసం సాత్విక్ ఏకంగా బెజ్జంకి పోలీసు స్టేషన్ వెళ్లాడు. బెజ్జంకి పోలీసు స్టేషన్‌ వెళ్లి ఎస్సై ఆవుల తిరుపతికి తన బాధను విన్నవించుకున్నాడు. తన సైకిల్‌ పోయిందని ఫిర్యాదు చేశాడు. దాన్ని వెతికి పట్టుకోవాల్సిందిగా కోరాడు.

ఆ పిల్లాడి మాటలు విన్న ఎస్ఐ ఆవుల తిరుపతి ఖంగుతిన్నారు. 11 ఏళ్ల బాలుడు ఎవరి సహాయం లేకుండా.. ఎలాంటి భయం లేకుండా.. ధైర్యంగా స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయడంపై హర్షించారు. ఆ పిల్లాడికి భరోసా ఇచ్చి సాత్విక్ తండ్రికి ఫోన్ చేశారు. సాత్విక్ తండ్రి సమాధానంతో మరోసారి షాక్ తినాల్సి వచ్చింది. తన కొడుకు సాత్విక్ బయట తిరగవద్దని తానే ఆ సైకిల్‌ను ఇంట్లో దాడి పెట్టినట్టు ఎస్సై ఆవుల తిరుపతికి వెల్లడించారు. సమస్య అంతటితో ముగిసింది. ధైర్యంగా స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసిన ఆ బాలుడిని ఎస్సై అభినందించారు.

కర్నూలు జిల్లా పెద్దకడుబూరులోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ పిల్లాడు తన పెన్సిల్‌ను తోటి విద్యార్థి దొంగిలించాడని ఏకంగా పోలీసుల దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు మిగితా పిల్లలనూ పిలిపించారు. ఏం జరిగిందో చెప్పమనగా.. అందులోని ఆ విద్యార్థి పోలీసులకు హన్మంతు తన బాధ చెప్పాడు. తన పెన్సిల్‌ను రోజు తోటి విద్యార్థి అయిన మరో హన్మంతు దొంగిలించాడని ఫిర్యాదు చేశాడు. అందుకే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరాడు.

అరెస్టు చేస్తే బెయిల్ రావడం కష్టం అని పోలీసులు ఆ విద్యార్థికి నచ్చజెప్పాడు. ఈ ఒక్కసారికి వదిలిపెట్టు అని సూచించాడు. వద్దు.. అరెస్టు చేయాల్సిందేనని చెప్పాడు. మళ్లీ తోటి విద్యార్థి ఆయన పెన్సిల్ దొంగిలించవద్దని ఆ పోలీసు బుద్ది చెప్పారు. ఆ తర్వాత ఈ ఒక్కసారికి రాజీకీ వచ్చి వదిలి పెట్టాలని కోరగా.. అందుకు హన్మంతు సరే అన్నాడు. ఆ వీడియో కొన్ని రోజులు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios