జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై ఆయన కుమార్తె తుల్జా భవానీ రెడ్డి పోరాటం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె సంచనల నిర్ణయం తీసుకున్నారు.
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై ఆయన కుమార్తె తుల్జా భవానీ రెడ్డి పోరాటం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. తన సంతకం ఫోర్జరీ చేశారని ఆరోపిస్తూ తండ్రిపైనే తుల్జా భవానీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెరువు భూమిని తన తండ్రి కబ్జా చేశారని ఆమె ఆరోపణలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె సంచనల నిర్ణయం తీసుకున్నారు. తన పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన భూమిని చేర్యాల మున్సిపాలిటికీకి అప్పగించినున్నట్టుగా ప్రకటించారు. ఈ రోజు ఉదయం చేర్యాల చేరుకున్న తుల్జా భవానీ రెడ్డి.. తన పేరుతో ఉన్న భూమి చుట్టూ ఉన్న ప్రహారీ గోడను మరికొందరితో కలిసి కూల్చివేశారు.
‘‘నా తండ్రి ఊరి భూమి కబ్జా చేసి నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినందుకు నేను చేర్యాల ప్రజలను నన్ను క్షమించమని అడుగుతున్నాను. నా తండ్రి నా పేరున పెట్టిన యావదాస్తి చేర్యాల మున్సిపాలిటికీ, హాస్పిటల్‌కు రిజిస్ట్రేషన్ చేయుచున్నాను’’ అని తుల్జా భవానీ రెడ్డి ఓ నోటీసును కూడా ప్రదర్శించారు.
ఈ సందర్భంగా తుల్జా భవానీ రెడ్డి మాట్లాడుతూ.. మత్తడి భూమిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని చెప్పారు. తప్పు జరిగిందని.. దానిని తాను కరెక్ట్ చేసుకుంటున్నానని తెలిపారు. ఆ భూమిని తిరిగి తాను చేర్యాల మున్సిపాలిటికే రాసిస్తున్నానని ప్రకటించారు. డాక్యూమెంట్ కూడా రెడీగా ఉందని.. ఎటువంటి ఇబ్బంది లేకుండా కోర్టు ద్వారా దానిని రెడీ చేసి కలెక్టర్‌కు అందజేస్తానని తెలిపారు. తన తండ్రి రెండు సార్లు ఎమ్మెల్యే అని.. ఇలాంటి పని చేసి ఉండాల్సింది కాదన్నారు. తన తండ్రి ఎమ్మెల్యే కాకముందే.. బాగానే సంపాదించారని.. వెయ్యి కోట్ల ఆస్తి ఉందని అన్నారు. అలాంటి వ్యక్తి.. ఇలాంటి భూమి తీసుకుని ఉండకూదని చెప్పారు.

వివాదం ఏమిటంటే..
చేర్యాల పట్టణంలోని సర్వే నంబర్ 1402లో తన పేరు మీద నమోదైన భూమి మత్తడి భూమి అని.. అది ప్రభుత్వ ఆస్తి అని భవానీ చెబుతున్నారు. 2020లో నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ జరిగిందని.. కానీ 2022 జూలై లో అది లిటిగేషన్‌లో పడినప్పుడు మోసం గురించి తనకు తెలిసిందని అంటున్నారు. హైకోర్టు, లోకాయుక్తలో దాఖలు చేసిన పిటిషన్లనలో కూడా తన సంతకం ఫోర్జరీ చేయబడిందని ఆరోపించారు. తన తండ్రి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కావడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తాను లేకుండానే భూ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారని అన్నారు. తన నకిలీ సంతకాలు ఎన్ని పత్రాలపై ఉన్నాయో కూడా తెలియడం లేదని ఆమె చెబుుతన్నారు. చాలా పోరాటం తర్వాత నేను చేర్యాల భూమి కాగితాలను పొందగలిగానని తుల్జా భవానీ రెడ్డి చెప్పారు.
అయితే తన కూతురు ఆరోపణలను ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఖండించారు. చేర్యాలలోని ఆ భూమి ప్రభుత్వ ఆస్తి కాదని పేర్కొన్నారు. ఎన్నికల ఏడాది కావడంతో ప్రతిపక్షాలు తనపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నాయని ఎమ్మెల్యే విమర్శించారు.
