సూర్యపేటలో పట్టపగలు నడిరోడ్డుపై ఓ వ్యక్తిపై ముగ్గురు వ్యక్తులు అత్యంత దారుణంగా దాడిచేసి చంపేందుకు ప్రయత్నించారు. 

సూర్యాపేట : మద్యంమత్తు జీవితాలను చిత్తుచేస్తోంది. మత్తులో ఒళ్లుమరిచి కొందరు ప్రాణాలమీదకు తెచ్చుకుంటుంటే... విచక్షణ కోల్పోయిన మరికొందరు ఇతరుల ప్రాణాలు తీస్తున్నారు. ఇలా ముగ్గురు దుండగులు ఫుల్లుగా మద్యంసేవించి నడిరోడ్డుపైనే ఒకరిని అంతమొందించేందుకు ప్రయత్నించారు. ఈ దుర్ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... సూర్యాపేట పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కొందరు దుండుగులు బీభత్సం సృష్టించారు. పట్టపగలు నడిరోడ్డుపై తాగినమైకంలో ఊగిపోతున్న ముగ్గురు దుండగులు ఒకడిపై కత్తులతో దాడికి దిగారు. అందరూ చూస్తుండగానే వ్యక్తిని కిందపడేసిన దుండగులు కత్తితో విచక్షణారహితంగా పొడిచారు. అంతేకాదు బండరాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నించారు. 

దుండగులను కొందరు అడ్డుకోడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే వారినుండి తప్పించుకున్న వ్యక్తి తీవ్ర గాయాలతో రోడ్డుపై పరుగుతీసాడు. ఇలా తీవ్ర రక్తస్రావం అవుతున్నా ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగుతీస్తున్న వ్యక్తిని స్థానికులు హాస్పిటల్ కు చేర్చారు. 

Read More మంచానపడ్డ భర్తను వదిలేసిన భార్య... మానవత్వం చాటిన రాచకొండ సిపి చౌహాన్

ఈ దాడిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని స్థానికుల నుండి వివరాలు సేకరించారు. అలాగే ఏరియా హాస్పిటల్ కు వెళ్ళి బాధితుడి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసారు. బాధితుడు, దుండగుల వివరాలు... హత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి వుంది.